కాంట్రాక్టు జాబ్స్ కోసం డబ్బులు వసూలు.. తిరిగి చెల్లించని వైనం

కాంట్రాక్టు  జాబ్స్ కోసం డబ్బులు వసూలు.. తిరిగి చెల్లించని వైనం

గోదావరి ఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌)లో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన దళారులు తిరిగి చెల్లించడం లేదు. పైసలు కట్టి ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు.. దళారులు, మధ్యవర్తుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా స్పందించడం లేదు. పైగా డబ్బులు చెల్లించేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సైతం పట్టించుకోకపోవడంతో.. బాధితులు ఆత్మహత్య బాటపడుతున్నారు.

ఇప్పటికే నాలుగు ఘటనలు..

ఎరువుల ఫ్యాక్టరీ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూర్‌ గ్రామానికి చెందిన బాధితుడు ముంజ హరీశ్‌‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన గంగుల శేఖర్‌ పాయిజన్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇదే మండలం రామారావుపల్లికి చెందిన గణేశ్​సైతం పాయిజన్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తాజాగా సోమవారం గోదావరిఖని తిలక్‌‌ నగర్‌‌కు చెందిన అపరాది శ్రీనివాస్‌‌ అనే బాధితుడు పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.

ఏం జరిగిందంటే..

ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసేందుకు గతంలో ఫైవ్‌‌ స్టార్‌ అనే కంపెనీ 790 మంది నియమించుకుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, రూలింగ్ పార్టీకి చెందిన కొందరు దళారులుగా వ్యవహరించి, ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత చౌదరి అనే కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుని, తమకు వర్కర్లు అవసరం లేదని 340మందిని తొలగించింది. దీంతో బాధితులంతా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటికి వెళ్లగా.. డబ్బులు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న హరీశ్ ​కుటుంబానికి రూ.29లక్షలు ఇస్తానని మాటిచ్చారు. దీనిపై అఖిలపక్షంతో కమిటీ వేయగా.. 260మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు అవుతున్నా, ఇప్పటికీ డబ్బులు ఇప్పించలేకపోయారు. ఆత్మహత్య చేసుకున్న బాధితుడికి రూ.9లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ దందాలో మొత్తం రూ.20కోట్ల వరకు స్కాం జరిగినట్లు అంచనా.

పర్మినెంట్ ఉద్యోగమని నమ్మించి..

బొగ్గుతో నడిచే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వివిధ కారణాల వల్ల 1999లో మూతపడింది. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి కాకా, ఆయన తనయుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. రూ.10వేల కోట్లు రుణాన్ని మాఫీ చేయించారు. పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ఒప్పించారు. మోడీ హయాంలో రూ.7 వేల కోట్లు మంజూరు కావడంతో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 2020లో ఈ కంపెనీ ప్రారంభమై యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది.

ఈక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం టెండర్లు ఆహ్వానించగా.. కోల్ కత్తాకు చెందిన ఫైవ్​స్టార్ అనే కంపెనీ ముందుకొచ్చింది. గోదావరిఖనికి చెందిన టీఆర్ఎస్ లీడర్లు మోహన్ గౌడ్, గుండు రాజు సదరు కంపెనీకి రూ.రెండు కోట్లు చెల్లించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి దళారులను నియమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. పర్మినెంట్ ఉద్యోగమని నమ్మించి, 790మంది నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేశారు. ఫైవ్ స్టార్ కంపెనీ కాంట్రాక్ట్ ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో చౌదరి అనే కొత్త కంపెనీ కాంట్రాక్ట్ చేజిక్కించుకుంది. కార్మికులు అవసరానికి మించి ఉన్నారని 340మందిని తొలగించడంతో.. ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు పెట్టి ఉద్యోగాలు పొందామని, తిరిగి పైసలు ఇచ్చేయాలని మోహన్​గౌడ్​, గుండు రాజుతో పాటు దళారుల ఇండ్ల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు.

స్పందించని  మంత్రి, ఎంపీ..

మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​అనుచరులే ఈ అక్రమాలకు పాల్పడినా.. ఇప్పటివరకు బాధితులకు న్యాయం చేయలేదు. ఈ దందాలో మంత్రికి, ఎమ్మెల్యేలకు సంబంధం ఉందంటూ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత సైతం ఈ ఘటనపై నోరు విప్పలేదు. రెండు నెలల కింద బాధితులు ఆందోళన చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా హరీశ్​ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు.. మోహన్​గౌడ్​, గుండు రాజుతో పాటు దళారులైన చెలకలపల్లి సతీశ్, బొమ్మగాని తిరుపతిగౌడ్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. సెప్టెంబర్‌‌ మొదటి వారంలో పోలీస్‌‌ కస్టడీకి తీసుకుని విచారించి, మళ్లీ జైలుకు పంపించారు. గుండు రాజుకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్‌‌ మంజూరు చేశారు. వారు ఎప్పుడు బయటకు వస్తారా? ఎప్పుడు న్యాయం చేస్తారా? అని బాధితులు ఎదురు చూస్తున్నారు.