నకిలీ పత్రాలతో ఘరానా మోసం

నకిలీ పత్రాలతో ఘరానా మోసం
  • రూ.45 లక్షలు గుంజారని ఆందోళన
  • నిందితుల ఇంటి ముందు పంది మాంసంతో నిరసన

బెల్లంపల్లి, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి భూమి అమ్ముతామని నమ్మించి రూ.45 లక్షలు మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. పంది మాంసంతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్​పల్లిలో జరిగింది. బాధితులు బాలాని గంగరాజు, పూజారి సమ్మయ్య, నాగేశ్, దాసరి శ్యామ్, గోపి, పోల రాములుతో పాటు పాత మంచిర్యాలకు చెందిన బొలిశెట్టి భీమయ్య సోమవారం విలేకరులతో మాట్లాడారు.

 వారి వివరాల ప్రకారం.. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 340/1, 341/బిలో 12 ఎకరాల భూమిని అమ్ముతామని బట్వాన్​పల్లికి చెందిన రాంటెంకి శివ, రాంటెంకి హరికృష్ణ కలిసి  పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని దుబ్బపల్లికి చెందిన ఎరుకల కులస్తులైన పలువురితో ఒప్పందం చేసుకున్నారు. భూమి ఆంధ్రప్రదేశ్​కు చెందిన తాతారావు, శ్రీనివాసరావుది అని నకిలీ పత్రాలు చూపించారు.

 భూమి రిజిస్ట్రేషన్ జరగకపోయినా నమ్మకంతో రూ.45 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత మోసపోయామని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారి ఇండ్ల వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. పంది మాంసం తీసుకొచ్చి నిరసన తెలిపారు. డబ్బులు ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, ఇబ్బందులు కలిగిస్తే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని వెల్లడించారు.