వరద సాయానికి పదివేల కష్టాలు.. మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు

వరద సాయానికి పదివేల కష్టాలు.. మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు

 

  • పొద్దుగాల నుంచే సెంటర్ల వద్ద జనం క్యూ
  • తిండీతిప్పల్లేకుండా గంటల తరబడి లైన్లలోనే..
  • చిన్న పిల్లలతో వచ్చిన మహిళల అవస్థలు.. స్పృహ తప్పి
    పడిపోయిన వృద్ధులు
  • ఒక్కో అప్లికేషన్‌కు రూ. 400 వరకు వసూలు
  • రెండ్రోజుల్లో 3 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్న అధికారులు

హైదరాబాద్‌, వెలుగు: గ్రేటర్‌హైదరాబాద్‌లో వరద సాయం గందరగోళంగా మారింది. రెండో రోజూ మీ సేవ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. పొద్దున 6 గంటలకే సెంటర్లకు జనం పోటెత్తారు. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తుల నమోదు కోసం తోపులాటలు జరిగాయి. జనం గేట్లు బద్దలు కొట్టుకొని కౌంటర్ల దగ్గరకు పరుగులు తీశారు. ఇంకొన్ని చోట్ల మీ సేవ సిబ్బంది అప్లికేషన్లకు మస్తు పైసలు వసూలు చేశారు. ఇదేమని అడిగిన వాళ్లకు దురుసుగా జవాబిచ్చారు. చాలా ప్రాంతాల్లో చంటి పిల్లలతో మహిళలు గంటల తరబడి క్యూల్లో నిల్చొని ఇబ్బంది పడ్డారు. గంటలకు గంటలు లైన్లలో నిలబడ్డ ముసలి వాళ్లు ఓపిక లేక సొమ్మసిల్లి పడిపోయారు. సాయం కోసం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు

వరద బాధితులకు తొలి రోజుల్లో నేరుగా రూ. 10 వేల సాయం అందించారు. అయితే చాలా చోట్ల జనం తమకు సాయం అందలేదని ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. ధర్నాలు చేశారు. కార్పొరేటర్లను నిలదీశారు. ఎమ్మెల్యేల ఇండ్లను చుట్టుముట్టారు. మంత్రుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌సహా చాలా మందికి ఈ నిరసన సెగలు తగిలాయి. ఈ నిరసనలను ఆపాలని భావించిన ప్రభుత్వం లబ్ధిదారులను మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. కాగా మంగళవారం వరద బాధితుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించడానికి మీ సేవ కేంద్రానికి వెళ్లిన జూబ్లీహిల్స్‌ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను మహిళలు చుట్టుముట్టారు. కొందరికి ఇండ్ల దగ్గరకు వెళ్లి సాయం చేసి తమనెందుకు పట్టించుకోలేదని నిలదీశారు. గోపీనాథ్‌చిరాకు పడడంతో వాళ్లు సీరియస్‌ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే సైలెంట్‌గా వెళ్లిపోయారు.

ఉదయం నుంచే పోటెత్తిన జనం

రాంనగర్ ‘మీసేవ’ సెంటర్ దగ్గర తెల్లవారుజాము నుంచే వందలాది మంది క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో నిలబడ్డన కొందరు ముసలివాళ్లు సొమ్మసిల్లి పడిపోయారు. మధ్యాహ్నం దరఖాస్తుదారులు పెరగడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. చప్పల్ బజార్‌లో 300 మంది ఒక్కసారిగా ‘మీసేవ’ వద్దకు రావడంతో స్థలం సరిపోక మెయిన్‌రోడ్డు వరకు క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్ జామైంది. సూరారంలో సర్వర్ డౌన్ వల్ల వందలాది మంది గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ముషీరాబాద్ ‘మీ సేవ’ దగ్గర వందలాది మంది మహిళలు లైన్లలో నిలబడ్డారు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు చాలా ఇబ్బంది పడ్డారు. కుషాయిగూడ, ఈసీఐఎల్‌చౌరస్తాల్లోని ‘మీ సేవ’ సెంటర్‌దగ్గర ఉదయం 6 నుంచే వందలాది మంది క్యూ కట్టారు. తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నా స్థానిక కార్పొరేటర్లు పట్టనట్టు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది.

సోమవారం నుంచి దరఖాస్తులు స్టార్ట్‌

వరద సాయం కోసం రెండ్రోజుల్లో 3 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం మీ సేవ సెంటర్లలో దరఖాస్తుల తీసుకోవడం స్టార్టయింది. ఫస్ట్‌రోజు 90,917 అప్లికేషన్లు వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 70 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. సాయంత్రం వరకు మరో లక్ష వస్తాయని అన్నారు. తుది గడువు చెప్పలేదు కాబట్టి బుధ, గురువారాల్లోనూ 3 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

అప్లికేషన్‌కు రూ. 400 వసూలు

మీ సేవ సెంటర్లకు వేలాది మంది వస్తుండటంతో నిర్వహకులు బిజినెస్‌కు తెరలేపారు. అప్లై చేయడానికి ప్రభుత్వ ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఫ్రీగా ఇవ్వాల్సిన దరఖాస్తుకు రూ. 20 నుంచి రూ. 50 వసూలు చేస్తున్నారు. అప్లికేషన్‌తీసుకోవడానికి రూ. 45 బదులు రూ. 400 వరకు తీసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే దురుసుగా జవాబిస్తున్నారు. ‘ఇష్టం ఉంటే అప్లై చేసుకోండి. లేకపోతే లేదు’ అంటూ కసురుకుంటున్నారు. వేరే దిక్కులేక జనం వాళ్లు అడిగినంత ఇచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇట్ల క్యూల్లో ఉంటే కరోనా కేసులు పెరగవా?

సోమవారం చాలా మంది మహిళలు ‘మీ సేవ’ సెంటర్లకు వెళ్లినా కొందరి దరఖాస్తులే తీసుకున్నారు. మిగతా వాళ్లను తర్వాత రోజు రమ్మని తిప్పి పంపారు. కొన్ని ప్రాంతాల్లో తర్వాతి రోజూ ఇదే పరిస్థితి ఉండటంతో మహిళలు మండిపడుతున్నారు. ‘ముందు రోజు లైన్‌లో 3 గంటలు నిలబడ్డ. టైమ్ అయిపోయిందంటే ఇంటిపోయిన. మళ్లీ మంగళవారం పొద్దుగల్ల 8 గంటలకు వచ్చి క్యూలో నిలబడ్డ. 11 అయినా పూర్తి కాలేదు’ అని రాంనగర్ మీ సేవ సెంటర్ దగ్గర ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు ఉన్న వాళ్లకు ఇంటికి వచ్చి పైసలు ఇచ్చారని, తమను రోడ్లపాలు చేశారని వాపోయారు. కరోనాతో జాగ్రత్తని ప్రభుత్వమే చెబుతోందని.. మీసేవల దగ్గర ఇలా వేలాది మంది క్యూ కడితే కేసులు పెరగవా అని జనం అడుగుతున్నారు. రూ. 4 వందల కోట్లు పంచితే తమ లాంటి నిజమైన బాధితులకు సాయం ఎందుకు అందలేదని నిలదీశారు. అర్హులైన వారిని వదిలేసి అధికారులు, నేతలు ఎవరికి సాయం చేశారని ప్రశ్నించారు. అధికారులు, టీఆర్‌ఎస్‌నేతలు ఏకమై తమ సాయం పంచుకు తిన్నారని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికుంటే డబ్బు నేరుగా ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌చేస్తున్నారు.

మీ సేవల చుట్టూ తిరుగుతున్నం

అధికారులు, లీడర్లు చేసిన తప్పులకు మేం ఇబ్బంది పడుతున్నం. వరదలు వచ్చిన టైమ్‌లో అర్హులైన మాకు అందాల్సిన డబ్బులు ఎవరికో ఇచ్చారు. ఇప్పుడు మేం మీసేవ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కరోనా టైమ్‌లో ఖాతాల్లో వేసినట్లు వేస్తే అయిపోయేది.

– ఉజ్వల, కుత్భిగూడ

డ్యూటీకి పోకుండా వచ్చిన

నిన్న గంటసేపు క్యూలో నిలబడిన. టైమ్ అయిపోవడంతో మీసేవ మూసేశారు. మళ్లీ పొద్దున 10 గంటలకు వచ్చి లైన్‌లో నిలబడ్డ. డ్యూటీకి వెళ్లకుండా వచ్చిన. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చాన్స్‌ఇస్తే టైమ్‌వృథా కాదు.

– సురేష్​, కింగ్​కోఠి

ఎందుకిట్ల బాధ పెడ్తున్నరు

వరద సాయానికి అప్లై చేసుకోవడానికి పొద్దుగాల 10 గంటలకు వచ్చిన. మధ్యాహ్నం రెండైనా క్యూ కదల్లేదు. ఒక్కొక్కరి దరఖాస్తుకు 10 నిమిషాలు పడుతోంది. గవర్నమెంట్‌మమ్మల్ని ఎందుకు ఇన్ని బాధలు పెడుతోంది. మొన్నటి వరకు డైరెక్టుగా వచ్చి పైసలిచ్చిన్రు. ఇప్పుడు ఖాతాలంటున్నరు. అసలు వస్తయో లేదో సమజైతలేదు.

– శోభ, చప్పల్ బజార్​