వరద సాయంపై కిరికిరి : డిసెంబర్​ 7 నుంచి ఇస్తామన్న సీఎం

వరద సాయంపై కిరికిరి : డిసెంబర్​ 7 నుంచి ఇస్తామన్న సీఎం

డిసెంబర్​ 7 నుంచి ఇస్తామన్న సీఎం..
ఆ మాటలు నమ్మి మీసేవ సెంటర్లకు పోటెత్తిన బాధితులు
అప్లికేషన్లు తీసుకోవడం లేదంటూ మీసేవల వద్ద నోటీసులు
ఇంటింటికి వచ్చి సర్వే చేశాకే ఇస్తామన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్
మండిపడ్డ బాధితులు.. మీసేవల ముందు నిరసనలు
గ్రేటర్​లో ఓట్లేయించుకొని మోసం చేశారంటూ ఆగ్రహం

హైదరాబాద్‌, వెలుగు: వరద సాయం కోసం మళ్లీ మీసేవ సెంటర్లు బాధితులతో పోటెత్తాయి. డిసెంబర్‌ 7 నుంచి అందరికీ సాయం అందజేస్తామని సీఎం చెప్పిన మాటలను నమ్మి బాధితులు.. సోమవారం పొద్దున 6 గంటల నుంచే  మీసేవ  సెంటర్ల ముందు లైన్లు కట్టారు. సాయం కోసం అప్లయ్​ చేసుకుందామని భారీగా రావడంతో మీసేవ నిర్వాహకులు సెంటర్లను క్లోజ్‌ చేశారు. అప్లికేషన్లు తీసుకోబోమని, గవర్నమెంట్‌ నుంచి తమకు ఆర్డర్ లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసర్లు కూడా మీసేవ సెంటర్ల వద్ద వరద సాయం సర్వీసు లేదని, వరద ప్రాంతాల్లో పర్యటించి సాయాన్ని నేరుగా అకౌంట్లలో జమ చేస్తారని ప్రకటించారు. ఈ మేరకు మీ సేవ సెంటర్ల వద్ద నోటీసులు అంటించారు. దీంతో బాధితులు మండిపడ్డారు. ఎలక్షన్ల తర్వాత అప్లయ్​ చేసుకోవాలని అప్పట్లో వెనక్కి పంపారని, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినంక అప్లికేషన్లు తీసుకోబోమంటే ఎట్లని నిలదీశారు. మీసేవ సెంటర్ల వద్దే బైఠాయించి ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కొందరికి ఇచ్చి మరికొందరికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.                          – నవంబర్‌ 28న ఎల్బీ స్టేడియంలో  గ్రేటర్‌ ఎన్నికల సభా వేదికపై కేసీఆర్‌

‘‘వరద సాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ టీమ్​లు గ్రౌండ్​లెవల్​లో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయి. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్  చెక్​ చేసిన తర్వాత వారి అకౌంట్ లోకి నేరుగా   డబ్బులు జమ జేస్తం.’’ –  ఇది సోమవారం (డిసెంబర్‌ 7)  మీ సేవ సెంటర్ల వద్ద అంటించిన నోటీస్​.

నమ్మించి గొంతు కోస్తున్నరు

గ్రేటర్​ ఎలక్షన్స్ ముందు కోడ్ వల్ల వరదసాయం ఆగిందన్నరు. ఏడో తారీఖు ఇస్తమంటే వచ్చినం. ఇప్పుడేమో ఇస్తలేరు. నమ్మించి గొంతు కోసుడంటే ఇదే. జనాల్ని ఇట్ల ఆగం చేయడం కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ మళ్లొస్తయ్​ కదా.. అప్పుడు చూస్కుంటం. – ఆరీఫుద్దీన్, గోల్కొండ