మిస్​ యూనివర్స్​ ఆస్ట్రేలియాగా ఇండియా అమ్మాయి

మిస్​ యూనివర్స్​ ఆస్ట్రేలియాగా ఇండియా అమ్మాయి

కిరీటం దక్కించుకున్న లాయర్​ ప్రియా సెరావ్​

మెల్​బోర్న్​: మిస్​యూనివర్స్​ ఆస్ట్రేలియా కిరిటాన్ని ఇండియన్​ దక్కించుకున్నారు. ఇండియాలో పుట్టి ఒమన్​, దుబాయ్​కి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రియా ఆలివియా సెరావ్​ను ఈ కిరీటం వరించింది. గురువారం రాత్రి ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో జరిగిన పోటీల్లో 26 మందిని వెనక్కు నెట్టి ఆమె నెగ్గింది. ఈ ఏడాది చివర్లో దుబాయ్​లో  జరిగే మిస్​ యూనివర్స్​ పోటీలకు ఆస్ట్రేలియా తరఫున 27 ఏళ్ల ప్రియా ప్రాతినిధ్యం వహించనుంది.

కర్నాటకలోని బెల్మన్ను ఆమె సొంతూరు. ఆమె మెల్​బోర్న్​ లా స్కూల్​లో డిగ్రీ చదివారు. ప్రస్తుతం మెల్​బోర్న్​లోని ప్రెసింక్ట్స్​రీజియన్​లో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ జాబ్స్​లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, తానసలు ఈ పోటీల్లో పాల్గోవాలనుకోలేదని, అనుకోకుండా వచ్చి గెలవడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని గెలిచిన అనంతరం ప్రియా చెప్పారు. ‘‘పోటీల్లో ఇంకా వైవిధ్యం చూడాలనుకుంటున్నా. నా లాంటి వాళ్లు ఇంకా పోటీలోకి రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను గెలవడం చాలా అద్భుతంగా ఉంది” అని ఆమె అన్నారు. పాల్గొన్న తొలి పోటీలోనే కిరీటం దక్కించుకోవడం ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉందన్నారు. ఇంతకుముందు తానెప్పుడూ బ్యూటీ పోటీల్లో పాల్గొనలేదని, కనీసం మోడలింగ్​ కూడా చేయలేదన్నారు.

పోటీల్లో గెలిచాక ఆ ఫొటోను ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ‘‘గత 24 గంటల్లో జరిగిన విషయాలేవీ నమ్మబుద్ధి కావడం లేదు. నాకు ఎనలేని మద్దతునిచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ పోస్ట్​ పెట్టారు. ఈ పోటీల్లో వెస్టర్న్​ ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా కసింబా, విక్టోరియాకు చెందిన మరిజానా రాడ్మనోవిక్​లు రన్నరప్​లుగా నిలిచారు.