బీహార్ లో టీచర్ పై రెచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్

బీహార్ లో టీచర్ పై  రెచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్

పాట్నా : బీహార్‌‌లో ఓ టీచర్‌‌పై పోలీసు బెదిరింపులకు దిగాడు. 'ఎక్కువ మాట్లాడితే.. నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా.. అప్పుడు చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది'- అంటూ టీచర్‌‌కు అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడు. పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జముయి పోలీస్ స్టేషన్‌‌లో..  రాజేశ్ శరణ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబం వివాదాన్ని పరిష్కరించుకోవడానికి  పోలీసు స్టేషన్‌‌కు వచ్చాడు. అయితే, ఆ టీచరుపై రాజేశ్​ శరణ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఎంక్వయిరీ కోసం స్టేషన్‌‌కు రావాలని మూడు రోజుల కిందట చెబితే తీరిగ్గా ఇప్పుడు వస్తావా అని మండిపడ్డారు.

గోధుమ పంట కోయడం వల్ల ఆలస్యంగా వచ్చామని టీచర్ సమాధానం ఇచ్చారు. దీంతో రాజేశ్ శరణ్ కు కోపం కట్టలు తెంచుకుంది. 'ఎక్కువ మాట్లాడకు.. మేం ఎవ్వరినైనా సరే టెర్రరిస్టులుగా ప్రకటించగలం. ఒక్క సెకనులో నిన్ను కూడా టెర్రరిస్టుగా ప్రకటిస్తా. ఆ తరువాత నీకు చావు తప్పదు’’ అని రాజేశ్ తన కుర్చీలో నుంచి లేచి నిలబడి టీచర్ ను బెదిరించాడు. ఈ తతంగాన్నంతా  ఓ వ్యక్తి సీక్రెట్​గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో పోలీసు తన సీటులో నుంచి లేచి ఉపాధ్యాయుడిని బెదిరిస్తున్నట్లు కనిపించింది. పోలీసుల చుట్టూ ప్రజలు ఉన్నా ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఈ ఘటన  రెండు మూడు రోజుల కింద జరగగా.. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. దాంతో  రాజేశ్ శరణ్ పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.