
వీడియోకాన్ గ్రూప్– ఐసీఐసీఐ బ్యాంక్ రుణ వివాద కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్‌కు, వీడియోకాన్ గ్రూప్‌కు మధ్యన జరిగిన బిజినెస్ డీలింగ్స్ విషయంలో భారీ ఎత్తునే రుణాల మంజూరు జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణలో తెలుస్తోంది. కొచ్చర్ నేతృత్వంలో మొత్తంగా 24 రుణాలను అంటే రూ.7,862 కోట్లను వీడియోకాన్‌కు అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిందనే ఆరోపణలొస్తున్నాయి. కొచ్చర్ సీఈవోగా, ఎండీగా ఉన్న 2009 నుంచి 2018 మధ్యకాలంలో జారీ అయిన ఈ 24 రుణాలపై కూడా ఈడీ విచారణ కొనసాగుతోంది.
ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లు రెండూ కూడా వీడియోకాన్ గ్రూప్ చీఫ్ వేణుగోపాల్ ధూత్‌కు, కొచ్చర్ ఫ్యామిలీకి మధ్య జరిగిన క్విడ్ ప్రో కోలపై విచారణ జరుపుతున్నాయి. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు రూ.1,875 కోట్ల ఆరు హై వాల్యు లోన్స్‌ను చందాకొచ్చర్ నేతృత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేయడంతో, దానికి ప్రతిగా వేణుగోపాల్ ధూత్, కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కంపెనీ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో పెట్టుబడులు పెట్టారని తొలుత ఆరోపణలు వచ్చాయి. కానీ ఈడీ చేపడుతోన్న విచారణలో, మొత్తం రుణాలు అంటే ఫ్రెష్ లోన్స్ లేదా రెన్యువల్ లోన్స్, గ్యారెంటీస్ అన్ని కలుపుకుని వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు 2009 మే నుంచి 2017 జూన్ మధ్య కాలంలో రూ.7,826.20 కోట్లు జారీ అయినట్టు ఓ ఇంగ్లీష్ న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ రుణాలన్నింటిపై కూడా ఈడీ విచారిస్తున్నట్టు పేర్కొంది.
కొచ్చర్ ఇళ్లు కూడా అక్రమమే…
ముంబైలో చందా కొచ్చర్ నివసిస్తోన్న చర్చ్‌గేట్‌లోని సీసీఐ ఛాంబర్స్ వద్దనున్న ఫ్లాట్ కూడా అక్రమంగా పొందినదేనని ఈడీ చెబుతోంది. చందాకొచ్చర్ ఆ ఫ్లాట్‌లో 1997 నుంచి ఉంటోంది. ఈ ఫ్లాట్ వీడియోకాన్ సంస్థ– క్యూటీఏపీఎల్‌కు చెందినదని దర్యాప్తు సంస్థల అధికారులు అంటున్నారు. న్యూపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కొన్ని కంపెనీల్లో వేణుగోపాల్ ధూత్‌కు, కొచ్చర్ ఫ్యామిలీ మెంబర్లకు జాయింట్ హోల్డింగ్ ఉందని ఈడీ రిపోర్ట్ తెలుపుతోంది. వీడియోకాన్ గ్రూప్‌కు, కొచ్చర్లకు ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్‌లు ఇండియా, విదేశాల్లో ఆపరేషన్స్ సాగిస్తున్నాయి. అక్రమంగా, చట్టవిరుద్ధంగా రూ.7000 కోట్లకు పైగా ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు జారీ చేయడంపై మరింత విచారణ సాగుతోంది. ఈ విషయాలపై స్పందించడానికి ధూత్, ఐసీఐసీఐ బ్యాంకుల ప్రతినిధులు నిరాకరించారు.
విచారణలో ఉన్న లోన్ల వివరాలివే…
వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు దాని గ్రూప్ కంపెనీలకు 2012 ఏప్రిల్ 26న రూ.2,870 కోట్లు మంజూరయ్యాయి. 2011 అక్టోబర్ 31న రూ.881.4 కోట్ల రుణాలిచ్చింది. 2015 డిసెంబర్ 23న వీఐఎల్‌కు ఇచ్చిన రూ.236 కోట్ల రుణాలు, 2014 సెప్టెంబర్ 30న వీడియోకాన్ హైడ్రోకార్బన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.180 కోట్ల రుణాలపై ఈడీ విచారణ జరుపుతోంది. 2016 సెప్టెంబర్ 15న వీఐఎల్‌కు ఇచ్చిన రూ.536 కోట్ల రుణాలపై కూడా ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. చివరగా 2017 జూన్ 28న జారీ చేసిన రూ.166.4 కోట్ల లోన్‌పైనా విచారణ సాగుతోంది.