సెక్రటేరియట్ నిర్మాణంపైనా విజిలెన్స్ విచారణ చేయిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ నిర్మాణంపైనా  విజిలెన్స్ విచారణ  చేయిస్తాం   : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి పైనా విజిలెన్స్ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. పది పైసలు అయ్యేదానికి 11 పైసలైతే ఓకే కానీ అంతకన్నా ఎక్కువైందంటే ఏదో ఉన్నట్టేనని అన్నారు. మూడు పవర్ ప్రాజెక్టులు, నీటిపారుదల, మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ నడుస్తోందని చెప్పారు. ఇసుక పాలసీపై త్వరలోనే ప్రకటన చేయనున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తున్నామని అన్నారు. 

రైతు భరోసా పథకాన్ని వ్యవసాయం చేసే రైతులకే ఇస్తామని చెప్పారు.   తాము కేసీఆర్ లా బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి మోసం చేయబోమని అన్నారు. ప్రస్తుతం గత బడ్జెట్ కన్నా 70 వేల కోట్లు తగ్గిందని అన్నారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి అక్కర లేకున్నా పిలిచిన టెండర్లను రద్దు చేస్తామని  చెప్పారు. ఇరిగేషన్ అప్పులు, వడ్డీ లతో ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.  రైతు రుణమాఫీ కోసం బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే క్లారిటీ ఇస్తామని సీఎం చెప్పారు. 

అప్పుడు నన్ను అట్లే బయటికి పంపిండ్రు

హరీశ్ రావు శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనను కూడా బీఏసీ నుంచి బయటికి పంపారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2014లో టీడీపీ నుంచి తన పేరు, ఎర్రబెల్లి దయాకర్  రావు పేరు ఇచ్చారని, ఒక్కరినే అనుమతిస్తామని చెప్పి తనను బయటికి పంపారని గుర్తు చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం భాషపై మండలిలో సభ్యులు నిరసన తెలిపిన విషయం తన దృష్టికి వచ్చిందని తాను మాట్లాడింది తెలంగాణ భాషేనని అన్నారు. 

20 మంది ఎమ్మెల్యేల విషయం జగ్గారెడ్డినే అడగండి

20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని జగ్గారెడ్డి అంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరిక గురించి ఆయననే అడగాలని సీఎం బదులిచ్చారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలుపుకొని పోతామని చెప్పారు.  

మేడిగడ్డకు కేసీఆర్ నూ పిలుస్తం

13వ తేదీన ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ టూర్‌కు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పోదామంటే ఇంకో రోజు కూడా తీసుకెళ్తామని చెప్పారు.  మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ సాగుతోందని, తర్వాత జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని అందులో దోషులెవరో తేలుతుందని చెప్పారు. ఇతర శాఖల్లో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులను తొలగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.