సీఎంఆర్ నిల్వలపై విజిలెన్స్ ఆఫీసర్ల ఆరా

సీఎంఆర్ నిల్వలపై విజిలెన్స్ ఆఫీసర్ల ఆరా
  •     హైకోర్టు ఆదేశంతో నిల్వలు లెక్కిస్తున్న ప్రత్యేక కౌన్సిల్

వనపర్తి/ పానగల్, వెలుగు : వనపర్తి జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో రెండు రోజులుగా ఓ వైపు జిల్లా ఆఫీసర్లు, మరో వైపు హైకోర్టు ఆదేశాలతో  ఏర్పడిన ప్రత్యేక అడ్వకేట్ల కౌన్సిల్ తనిఖీలు నిర్వహిస్తూ సీఎంఆర్ నిల్వలను లెక్కిస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్ కు చెందిన ఓ రైస్ మిల్లర్ సీఎంఆర్ విషయంలో అవినీతికి పాల్పడ్డాడని, మిల్లులో ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర విజిలెన్స్ అధికారి కల్నల్ ప్రకాశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

ఈ మిల్లుపై  నెల క్రితం దాడి చేసి గోడౌన్ ను సీజ్ చేశారు. మిల్లులో ఉండాల్సిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ మిల్లు యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో హాజరుపరిచారు. తర్వాత సీజ్ చేసిన మిల్లులోని వడ్లను ఇతర మిల్లులకు తరలించి బియ్యంగా మారుస్తున్నారు. అయితే తనకు తెలియకుండా తన మిల్లుల్లోని వడ్లను తరలిస్తున్నారని, తనపై కక్ష కట్టే కేసులో ఇరికించారంటూ మిల్లు ఓనర్ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో హైకోర్టు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి మిల్లులోని ధాన్యం, తరలించిన వడ్ల వివరాలు తెలుసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్తకోట మండలం  మిరాషిపల్లి ఇషాన్ ట్రేడర్, వనపర్తిలోని కేదరనాథ్ రైస్ మిల్, పానుగల్ మండల పరిధి మందాపూర్ గ్రామంలోని మీనాక్షి ఫుడ్ ప్రొడక్షన్, ఇషాన్ ఆగ్రో, పానగల్ లోని పరమేశ్వర రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలను లెక్కించారు.

సివిల్ సప్లై ఆఫీసర్ల లెక్కల ప్రకారం 2,25,179 బస్తాలు లోటు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ విషయంపై సదరు రైస్ మిల్ యజమాని మాట్లాడుతూ జిల్లాలోని మిగతా మిల్లులకు టైం ఇచ్చిన ఆఫీసర్లు తనకు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనపై కక్షకట్టి సతాయిస్తుండడం వల్లే హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎంత ధాన్యం తరలించారో చెప్పాలని మిల్ యజమాని పరమేశ్వరరెడ్డి జిల్లా ఆఫీసర్లను కోరారు.