
- 2013 నుంచి 2023వరకు వాహనాల రిపేర్లు, డీజిల్ గల్లంతుపై ఆరా
- ఈ మధ్య కాలంలో రూ.2.60కోట్లకు పైగా అవకతవకలు?
- పూర్తి వివరాలు ఇవ్వాలని ఐదోసారి లేఖ
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారాలు, ప్రజాధనం దుర్వినియోగంపై రాష్ట్ర విజిలెన్స్ శాఖ మరోసారి స్పందించింది. ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు పంపిన అధికారులు, తాజాగా మంగళవారం ఐదో రిమైండర్ జారీ చేశారు. మూడు రోజుల్లో పూర్తి సమాచారం, ఒరిజినల్ కాపీలు సమర్పించాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్‌కు లేఖలో సూచించారు. కాగా 2013- నుంచి 2023 మధ్య సుమారు రూ.2.60 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శానిటేషన్ వాహనాల నిర్వహణలో అవకతవకలు బయటపడటంతో విజిలెన్స్ దృష్టి పెట్టింది. 2023లో 74 వాహనాల డేటా పంపించామని చెబుతుండగా, రిజిస్టర్‌లో మాత్రం 78 వాహనాలు నమోదు కావడంపై అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
ఫాగింగ్, డీజిల్ ఖర్చులపై అనుమానం..
2013 నుంచి 2023 వరకు మధ్య కాలంలో వాహనాల రిపేర్లకు అయిన ఖర్చు.. ? ఖర్చు కొటేషన్ఎవరు ఆమోదించారు..? డీజిల్ కొనుగోలు, సరఫరాపై విజిలెన్స్ అధికారులు వివరాలు కోరుతున్నారు. 2022–-23లో ఫాగింగ్, స్ప్రే రసాయనాల కొనుగోలు వివరాలు, బిల్లులు, టెండర్ విధానం, చెల్లింపులు తెలియజేయాలని ఆదేశించారు. 2023లో పారిశుద్ధ్య కార్మికులకు స్వీపింగ్ మెటీరియల్స్ కొన్నట్లు రసీదులు లేవని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల హాజరు, జీతాల వివరాలు, బదిలీల వివరాలు, లైసెన్స్ పొందిన షాపుల ఆదాయం, నిబంధనల వ్యతిరేకంగా నడుస్తున్న షాపుల జాబితా ఇవ్వాలని స్పష్టం చేశారు.
సమాచారం రాకపోతే ప్రభుత్వానికి నేరుగా నివేదిక పంపిస్తామని విజిలెన్స్ హెచ్చరించింది. మరోవైపు ఈ వ్యవహారంలో విజిలెన్స్ గతంలో నాలుగు సార్లు లెటర్లు రాయగా మున్సిపల్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంక్వైరీకి ఇవ్వాల్సిన వివరాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విజిలెన్స్ ఆఫీసర్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఏప్రిల్‌లో డీజిల్ కుంభకోణం బయటపడి బాధ్యులను గుర్తించినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి.