సీఎంఆర్‌‌‌‌ ఎగ్గొట్టిన మిల్లర్ల పై విజిలెన్స్‌‌‌‌ నజర్‌‌‌‌..మెదక్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

సీఎంఆర్‌‌‌‌ ఎగ్గొట్టిన మిల్లర్ల పై విజిలెన్స్‌‌‌‌ నజర్‌‌‌‌..మెదక్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

మెదక్, వెలుగు: ధాన్యాన్ని పక్కదారి పట్టించి సీఎంఆర్‌‌‌‌ అప్పగించని రైస్‌‌‌‌ మిల్లర్లపై విజిలెన్స్‌‌‌‌ ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​పెట్టారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. 2022– -23 సీజన్‌‌‌‌కు సంబంధించిన యాక్షన్‌‌‌‌ ప్యాడీ బకాయిలతో పాటు, 2024– -25 సీజన్‌‌‌‌కు సంబంధించి మెదక్​ జిల్లాలోని మిల్లర్లు రూ.90 కోట్ల విలువైన సీఎంఆర్‌‌‌‌ బకాయి పడ్డారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల బకాయిలు నలుగురైదుగురు మిల్లర్ల వద్దే ఉండటం గమనార్హం. నిర్దేశిత గడువులోగా సీఎంఆర్‌‌‌‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సివిల్‌‌‌‌ సప్లై అధికారులు పలుమార్లు హెచ్చరించినా కొందరు మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సివిల్‌‌‌‌ సప్లై కార్పొరేషన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఆదేశాలతో పెద్ద మొత్తంలో సీఎంఆర్‌‌‌‌ సరఫరా చేయని మిల్లుల్లో విజిలెన్స్‌‌‌‌ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలు మిల్లుల్లో సీఎంఆర్​ పక్కదారి పట్టినట్లు ఆఫీసర్లు గుర్తించారు. 

ఆఫీసర్ల ముమ్మర తనిఖీలు..

గత జులైలో కొల్చారం సత్యసాయి ఆగ్రో రైస్‌‌‌‌ మిల్లులో విజిలెన్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్‌‌‌‌ కోసం కేటాయించిన ధాన్యంలో రూ.7.17 కోట్ల విలువైన 3,029 టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్‌‌‌‌లో శివ్వంపేట ఓం సాయి వెంకటరమణ రైస్‌‌‌‌ మిల్లులో తనిఖీలు చేయగా, 2022– -23 సీజన్‌‌‌‌కు సంబంధించి రూ.53.91 లక్షల విలువైన 6,026 బస్తాలు (241 టన్నులు) ధాన్యం కనిపించలేదు. గత నెలలో చేగుంట మండలం బోనాల కొండాపూర్‌‌‌‌ భద్రకాళి మోడ్రన్‌‌‌‌ రైస్‌‌‌‌ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. 2024– -25 వానాకాలం, యాసంగి సీజన్లకు కేటాయించిన ధాన్యంలో రూ.3.72 కోట్ల విలువైన 1,267 టన్నులను మిల్లింగ్‌‌‌‌ చేయకుండా విక్రయించినట్లు గుర్తించారు. 

ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు నిర్ధారించి, సివిల్‌‌‌‌ సప్లై డీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మిల్లు యాజమాన్యానికి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. తాజాగా నిజాంపేట మండలం నస్కల్‌‌‌‌ శ్రీ విద్య రైస్‌‌‌‌ మిల్లులో రూ.12 కోట్ల విలువైన 5 వేల మెట్రిక్‌‌‌‌ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. మెదక్‌‌‌‌ మండలం మంబోజిపల్లి మంజీరా రైస్‌‌‌‌ మిల్లులోనూ రూ.5 కోట్ల విలువైన 2 వేల మెట్రిక్‌‌‌‌ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. శుక్రవారం వెల్దుర్తి శివసాయి రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ ఫోర్స్​మెంట్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించగా 2022– 23కు సంబంధించి రూ.9 కోట్ల విలువైన 4,400 టన్నుల ధాన్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. తూప్రాన్ సాయినాథ్​ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రూ.7 కోట్ల విలువైన 3 వేల టన్నుల ధాన్యం తక్కువ ఉన్నట్టు తేలింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 14 మిల్లులపై కేసులు నమోదైనట్లు ఆఫీసర్లువెల్లడించారు.