ముద్దు పెట్టిస్తాడా.. కత్తి పట్టిస్తాడా.. మాస్ దర్శకుడితో విజయ్ సినిమా!

ముద్దు పెట్టిస్తాడా.. కత్తి పట్టిస్తాడా.. మాస్ దర్శకుడితో విజయ్ సినిమా!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఈ ఇద్దరు ఎవరికీ వారు చాల ప్రత్యేకం. ఒకరేమో యూత్ ఫుల్ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటే.. మరొకరేమో మాస్ చిత్రాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు. నిజానికి ఈ ఇద్దరివి వేరు వేరు ధ్రువాలు. అలాంటి ఈ ఇద్దరు ఒక సినిమా కోసం జతకడితే ఎలా ఉంటుంది. అలాంటి ఆలోచనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వచ్చినట్టుంది. అందుకే ఈ ఇద్దరితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. 

ఇటీవల నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటితో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అప్డేట్ కూడా ఉంటుందని ఒక పిక్ కూడా రిలీజ్ చేశారు. ఇక అప్పటినుండి ఈ ప్రాజెక్టులో హీరోగా ఎవరు చేస్తారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే చాలా కాలం క్రితమే బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. దాంతో ఈ సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని అనుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బోయపాటి కాంబోలో ఒక సినిమా చేయాలని కూడా ప్లాన్ చేశారు అల్లు అరవింద్. కాబట్టి సినిమాలో మెగాస్టార్ హీరోగా చెయ్యనున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లిస్టులోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేరిపోయాడు. గీత ఆర్ట్స్ లో విజయ్ దేవరకొండ ఇప్పటికే గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు. అప్పటి నుండి అల్లు అరవింద్ విజయ్ తో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. దాంతో ఈ రేర్ కంబోని సెట్ చేసే పనిలో ఉన్నారట అల్లు అరవింద్. నిజానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈలోగా విజయ్ తో సినిమా చేయాలని సూచించాడట అల్లు అర్జున్. అలా ఈ ప్రాజెక్టులోకి విజయ్ దేవరకొండ వచ్చాడని తెలుస్తోంది. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా.. విజయ్ తరహాలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందా? లేక బోయపాటి తరహాలో పక్కా యాక్షన్ మూవీగా వస్తుందా అనేది చూడాలి.