Vijay Devarakonda: అందరం కలిసి ఎదగడం ఎందుకు మానేశాం? విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్

Vijay Devarakonda: అందరం కలిసి ఎదగడం ఎందుకు మానేశాం? విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాపై ఆన్‌లైన్‌లో నెగటివ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ప్రముఖ టికెటింగ్ వేదిక బుక్‌మై షో తన వెబ్‌సైట్‌లో ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ విషయంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. సినిమా పరిశ్రమకు చాలా అవసరమైన చర్యగా అభివర్ణించారు. ఎంతో మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు పెట్టే కష్టం, కలలు, పెట్టుబడులు ఈ నిర్ణయం వల్ల కొంతవరకు రక్షణ పొందుతాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 

ఇటీవల కొంతమంది ఆన్‌లైన్ టికెటింగ్, రివ్యూ ప్లాట్‌ఫార్మ్‌లలో కావాలనే సినిమాలకు నెగటివ్ రివ్యూలు, తక్కువ రేటింగ్స్ ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ద్వారా సినిమాలకు నష్టం కలిగిస్తున్నారని సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ప్రేక్షకుల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతూ సినిమాల కల్లెక్షన్లపైపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితి కారణంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా బృందం కోర్టును ఆశ్రయించి రివ్యూలు, రేటింగ్స్‌ను ఆపాలని కోరింది. కోర్టు వారి అభ్యర్థనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో బుక్‌మై షో వెంటనే ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్‌ను తొలగిస్తూ చర్యలు చేపట్టింది.

కోర్టు నిర్ణయంపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. “ఈ నిర్ణయం చూసి నాకు సంతోషంతో పాటుగా బాధ కూడా ఉంది. సంతోషం ఎందుకంటే.. ఎంతో మంది కష్టపడి చేసిన సినిమా, వారి కలలు, పెట్టిన డబ్బు ఇప్పుడు కొంతవరకు రక్షణ పొందాయి.

బాధ ఎందుకంటే.. మనవాళ్లే ఇలా కావాలని ఇతరుల సినిమాలపై దాడులు చేస్తుండడం బాధాకరం. ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనే భావన ఎక్కడ పోయింది? అందరం కలిసి ఎదగడం ఎందుకు మానేశాం?” Dear Comrade సినిమా రోజుల నుంచే తన సినిమాలపై పద్ధతి ప్రకారం జరుగుతున్న నెగటివ్ దాడులను గమనించానని ఆయన చెప్పారు.

“నేను ఎన్నో సార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ ‘మంచి సినిమా అయితే ఎవ్వరూ ఆపలేరు’ అని నాకు చెప్పారు. కానీ నా వెంట పనిచేసిన ప్రతి నిర్మాత, దర్శకుడు ఈ సమస్య ఎంత పెద్దదో ఆ తర్వాతే అర్థం చేసుకున్నారు.”

ఇంకా ఆయన ఇలా అన్నారు. “ఎలాంటి మనుషులు ఇలా ఇతరుల కలలను నాశనం చేస్తారో అనుకుని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఉన్నాను. ఇప్పుడు కోర్టు కూడా ఈ సమస్య నిజమే అని గుర్తించడం ఆనందంగా ఉంది. మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకే ఇలా అయితే, చిన్న వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఈ ఆదేశం సమస్యను పూర్తిగా తీరుస్తుంది అనుకోవడం లేదు, కానీ ఇది ఒక పెద్ద భారం తగ్గించినట్టే.”

చివరగా ఆయన.. “ఇప్పటికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు, అలాగే సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అన్ని సినిమాలకు మంచి విజయాన్ని కోరుకుందాం. వీటన్నీ మనల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం.”అని విజయ్ తెలిపారు.