టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరో సారి వార్తల్లో నిలుస్తున్నారు. గత నెల ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వైవాహిక బంధంతో ఒకటైన ఈ కొత్త దంపతులు తమ దాంపత్య జీవితంలో ఒక నెలను పూర్తి చేసుకున్నారు. పెళ్లి సందడి ముగియడంతో..ఈ క్రేజీ జంట తిరిగి తమ వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి సారించింది. వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీ అయ్యారు.
అనంతపురంలో ఘనస్వాగతం
లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'రణబాలి' (Ranabaali) . ఈ సినిమా షూటింగ్ కోసం ఈ జంట గురువారం ( మార్చి 26, 2026 ) సాయంత్రం అనంతపురం చేరుకున్నారు. కర్నూలు నుంచి వీరు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో, నగర శివారులోని తపోవనం వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ప్రియతమ నటులను చూసేందుకు జనం ఎగబడటంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అక్కడి నుంచి క్లాక్ టవర్ మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న ఈ జంటకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్
షూటింగ్ విరామంలో దైవ దర్శనానికి వచ్చిన ఈ జంట తమ సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశ నీలం రంగు కుర్తాలో మెరిసిపోయింది. లక్నోవీ చికంకారీ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ కుర్తాకు తోడుగా బ్లూ డెనిమ్ జీన్స్ ధరించి మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్‌ను బ్యాలెన్స్ చేసింది. నుదుట సింధూరం, మంగళసూత్రం ధరించి నిఖార్సైన తెలుగింటి కోడలిలా కనిపిస్తూనే, తన నేచురల్ గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.. ఎప్పుడూ ట్రెండీగా ఉండే విజయ్, ఈసారి లేత బెజ్ రంగు కుర్తా, చాక్లెట్ బ్రౌన్ ప్యాంట్ ధరించి క్లాసీగా కనిపించాడు. నుదుట తిలకం, మెడలో బంగారు గొలుసుతో పక్కా ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపించి అభిమానులను మురిపించాడు.
హ్యాట్రిక్ దిశగా 'రణబాలి'
గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి'తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనంతపురం పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా కీలక షెడ్యూల్ జరగనుంది.
