Vijay Deverakonda: సైలెంట్ గా విజయ్, రష్మికల సినిమా షూటింగ్.. కథేంటంటే?

Vijay Deverakonda: సైలెంట్ గా విజయ్, రష్మికల సినిమా షూటింగ్..  కథేంటంటే?

టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక గురించి రూమర్స్ చాలా కాలం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఎటువంటి హడావిడి లేకుండా, గుట్టుగా ఈ జంట తమ మూడో సినిమాను ప్రారంభించేశారు.

'ట్యాక్సీవాలా' కాంబో మళ్ళీ..
విజయ్ కెరీర్‌లో 'ట్యాక్సీవాలా' ఒక సూపర్ హిట్. ఆ సినిమా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ చాన్నాళ్ల క్రితమే విజయ్‌తో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా పట్టాలపైకి వచ్చింది.  హైదరాబాద్‌లో"ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా రష్మిక నటిస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.  

ఈ హిట్ పెయిర్ తో  వస్తున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరాయి.  దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమా కథతో రష్మికను చాలా సులభంగానే మెప్పించారని సమాచారం. రష్మిక సైతం ఈ కథాంశానికి ఫిదా అయ్యారని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్ స్టోరీ!
ఈ సినిమా కథాంశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన ఒక కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో, ఇంతకుముందెన్నడూ చూడని ఒక విలక్షణమైన పల్లెటూరి పాత్రలో కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రలో విజయ్‌ నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం కథలో ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా బలంగా ఉంటాయని, రాహుల్ సంక్రిత్యాన్ ఈ కథను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. అంతే కాదు 'ద మమ్మీ' ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

రికార్డు సృష్టిస్తారా..?
ఒకప్పుడు 'గీత గోవిందం'తో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక జంట.. 'డియర్ కామ్రేడ్'తో ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ వారి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ జంట నటించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విజయ్‌కి 'కింగ్డమ్' సినిమాతో ఆశించిన విజయం దక్కలేదు. హిట్ కోసం విజయ్ ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయనకు ఈ చిత్రం చాలా కీలకం. ఇక రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. ఈ ఇద్దరి కెరీర్‌కు ఈ కొత్త సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రంతో ఈ జంట ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .