
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక పీరియాడికల్ మూవీ అనే విషయాన్ని అనౌన్స్‌మెంట్ సందర్భంగా తెలియజేశారు. అయితే ఇందులో విజయ్ డబుల్ రోల్ చేయబోతున్నట్టు తాజా సమాచారం.
అదికూడా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడట. రాహుల్ సంకృత్యాన్ గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’లోనూ నాని తండ్రీ కొడుకులుగా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ డబుల్ రోల్ చేసినప్పటికీ.. అది వేర్వేరు కథలుగా ఉండే రొమాంటిక్ డ్రామా. ఈసారి తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడని వినిపిస్తుండడంతో ఒకేసారి ఈ రెండు పాత్రలు కనిపిస్తాయా, లేక రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో కనిపిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ నటిస్తున్న చిత్రం వైజాగ్‌లో షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. మరోవైపు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రంలోనూ విజయ్ నటించనున్నాడు.