బాయ్ కాట్ ‘లైగర్’.. ఎందుకు, ఏమిటి ?  

బాయ్ కాట్ ‘లైగర్’.. ఎందుకు, ఏమిటి ?  

బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాను కూడా తాకింది.  ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాయ్ కాట్ సెగను ఎదుర్కొన్న వైనాన్ని మర్చిపోకముందే.. ‘లైగర్’ కూడా దాని బారినపడింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. లైగర్ ను బాయ్ కాట్ చేయాలనే అంశం ప్రచారంలోకి రావడానికి కారణం.. హీరో విజయ్ చేసిన కామెంట్స్, నిర్మాత కరణ్ జోహర్ అని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ మరో ఐదు రోజుల్లో (ఆగస్టు 25న) విడుదల కానుందనగా ఈవిధంగా బాయ్ కాట్ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం చేస్తున్న నెటిజన్లు  తమ వాదనను సమర్ధించుకుంటున్నారు.  ‘‘బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన కరణ్ జోహర్ ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నందున లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నం’’ అని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానించారు. 

రంగంలోకి విజయ్ ఫ్యాన్స్.. 

ఈనేపథ్యంలో విజయ్ దేవరకొండకు మద్దతుగా అతడి ఫ్యాన్స్ ట్విటర్ లో  రంగంలోకి దిగారు. ‘సపోర్ట్ లైగర్’ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టారు.  ‘‘ విజయ్ ఎంతో కష్టపడి ఒక స్టార్ గా ఎదిగాడు. అతన్ని ఎదగనివ్వండి. అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. లైగర్ సినిమా ప్రొడ్యూసర్ గా కరణ్ జోహర్ ఉంటే తప్పేంటి .. కరణ్ జోహర్ ప్రొడ్యూసర్ గా ఉంటే విజయ్ దేవరకొండ ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి. బాయ్ కాట్ ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు’’ అని విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా  ప్రశ్నించారు. ‘‘లైగర్ ను బాయ్ కాట్ చేయాలనే నినాదం చేసేముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. విజయ్ దేవరకొండ కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటివాడే. చాలా కింది స్థాయి నుంచి స్టార్ గా ఎదిగిన సామాన్య వ్యక్తి విజయ్. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తర్వాత విజయ్ దేవరకొండ వెలుగులోకి వచ్చాడు. అతడి సినిమాను బాయ్ కాట్ చేసేముందు కొంచెం ఆలోచించండి.. విజయ్ కెరీర్ ను నాశనం చేయొద్దు’’ అని  మరో నెటిజన్ విజ్ఞప్తి చేశాడు. 

 

ఇటీవల విజయ్ చేసిన వ్యాఖ్యలివీ.. 

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కూడా బాయ్ కాట్ సెగను ఎదుర్కొంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ట్రోలింగ్ జరగడాన్ని ఖండించారు. లాల్ సింగ్ చద్దా మూవీని బాయ్ కాట్ చేయాలనడం సరికాదన్నారు. ‘‘ఒక సినిమాపై ఎంతోమంది నటులతో పాటు వందలాది సినీకార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఈ అంశాన్ని పట్టించుకోకుండా బాయ్ కాట్ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఈవిధంగా బాయ్ కాట్ ట్రెండ్ ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు. దీనివల్ల అమీర్ ఖానే కాకుండా మొత్తం ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్నారు’’ అని  విజయ్ ఘాటుగా  వ్యాఖ్యానించారు.

‘‘ మేము సినిమాలు చేస్తాం. ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు. ఎవరు చూడొద్దనుకుంటున్నారో వాళ్ళు టీవీలో, ఫోన్లో చూస్తారు. అందులో అసలు మేము చేసేదేముంది? వాళ్ల గురించి పెద్దగా మాట్లాడక పోవడం బెటర్’’ అంటూ బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్న వారి గురించి విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ వ్యాఖ్యల వల్లే బాయ్ కాట్ ట్రెండ్ మొదలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.