ACE Review: ‘ఏస్‌‌‌‌’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

ACE Review: ‘ఏస్‌‌‌‌’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘ఏస్‌‌‌‌’(ACE).అరుముగ కుమార్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సేతుపతికి జంటగా రుక్మిణీ వసంత్‌‌‌‌ నటించింది. నేడు శుక్రవారం (మే 23న) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. శ్రీ పద్మిణి సినిమాస్ సంస్థ అధినేత బి.శివ ప్రసాద్ తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు.

రొమాంటిక్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్లో దివ్య పిళ్లై, యోగిబాబు, ‘పెళ్లి’ పృథ్వి, బి.ఎస్ అవినాష్, ముత్తుకుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విజ‌య్ సేతుప‌తి కెరీర్లో 51వ మూవీ ఇది. 2023లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది.

సామ్ సి.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించగా జస్టిన్ ప్రభాకరన్ పాటలు సమకూర్చారు. తెలుగులో ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీకి సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.  

కథేంటంటే:

బోల్ట్‌ కాశీ (విజయ్‌ సేతుపతి) కొన్ని సంఘటనల కారణంగా జైలు జీవితం గడుపుతాడు. జైలు జీవితం గడిపాక బుద్దిగా బ్రతకాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం ఏదైనా పనిచేసుకోవాలని మలేషియాకు వెళతాడు. అక్కడ జ్ఞానందం (యోగి బాబు) వద్ద ఆశ్రయం పొందుతాడు. కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌లో చెఫ్‌గా బోల్ట్ కాశీ జాయిన్ అవుతాడు. కల్పన ఈ హోటల్ కోసం తీసుకున్న లోన్ కట్టుటకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది.

ఈ క్రమంలో బోల్ట్ కాశీ మలేషియాలో ఉండే రుక్మిణి (రుక్మిణి వసంత్) ను ప్రేమిస్తాడు. అయితే, రుక్మిణి కూడా తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతుంటుంది. ఇలా ఒక్కొక్కరు మలేషియాలో ఒక్కో విధమైన కారణాలతో బ్రతికేస్తుంటారు. అయితే, అనుకోకుండా మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్)తో బోల్ట్‌ కాశీ శత్రుత్వం పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే బోల్ట్‌ కాశీ బ్యాంకులో దోపీడీ చేయడానికి సిద్దపడాల్సి వస్తోంది.

ALSO READ | Spirit: ఇంట్రెస్టింగ్.. ప్రభాస్-సందీప్ రెడ్డి ప్రాజెక్ట్లో హీరోయిన్గా కన్నడ బ్యూటీ!

 

ఇంతకు బోల్ట్‌ కాశీకి వచ్చిన కష్టమేమిటి? మలేసియా ఇల్లీగల్ డాన్ ధర్మతో బోల్ట్‌ కాశీకి ఉన్న సమస్య ఏంటీ? ఇండియాలో బోల్డ్ కాశీ అస‌లు జైలుకు ఎందుకు వెళ్లాడు? బ్యాంక్ వాళ్ళ నుండి హోటల్ నిలబెట్టుకోవడానికి కల్పన ఎలాంటి ప్లాన్ వేసింది? రుక్మిణి కూడబెట్టుకున్న డబ్బులతో తన ఇల్లుని విడిపించుకుందా? లేదా ఏదైనా స్కామ్ చేసిందా? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే!

ఎలా ఉందంటే:

ఇది కొత్త కథేం కాదు. ఇలాంటి సినిమాలన్నీ తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా వచ్చాయి. డబ్బు కోసం రెండు మూడు గ్యాంగ్‌లు ట్రై చేయడం, అందుకు బ్యాంక్ను దోపిడీ చేయాలనీ డిసైడ్ అవ్వడం, ఆ తర్వాత క్రైమ్ నుండి తప్పించుకోవడం ఇదే సినిమా. డార్క్‌ కామెడీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. క‌థ రొటీనే కానీ విజ‌య్ సేతుప‌తి స్క్రీన్ ప్ర‌జెన్స్‌, యాక్టింగ్‌, మ్యాన‌రిజ‌మ్స్‌తో డైరెక్ట‌ర్ మ్యాజిక్ చేశాడు. 

లవర్‌ కోసం హీరో దొంగగా మారడం, ఒక సమస్య నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే, మరో సమస్యతో చిక్కుల్లో పడటంతో నడుస్తుంది. డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్, ఇల్లీగల్ గ్యాంబ్లింగ్స్‌‌‌‌, చక్రవడ్డీలు లాంటి నంబర్ టు బిజినెస్‌‌‌‌ చూపించిన విధానం బాగుంది. ఇందులో ప్రధానంగా బ్యాంక్ దోపిడి ఉండటంతో ఇటీవలే సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీని గుర్తుచేస్తోంది.

ఫస్టాఫ్లో నటీనటులు పరిచయాలు, వారు ఎందుకోసం కష్టపడుతున్నారో చూపించారు. కామెడీకే ఇంపార్టెన్స్ ఇస్తూ కథనం నడిపించాడు. అసలైన స్టోరీ సెకండాఫ్లో చూపించారు డైరెక్టర్. బ్యాంకు రాబ‌రీ కోసం హీరో వేసే ప్లాన్‌, ఆ క్రైమ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి వేసే ఎత్తులు థ్రిల్లింగ్‌ అనిపిస్తాయి. బ్యాంక్ దోపిడీ, అలా బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో బయటపడటం కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే  కామెడీ, ఉత్కంఠ భరిత సన్నివేశాలు కథనంపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తాయి.

అయితే, ఇందులో బోల్డ్ కాశీకి సంబంధించిన గతాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పకపోవడం మైనస్గా నిలిచింది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ రాసుకున్న గేమ్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విజయ్ సేతుపతి మహారాజాకు ముందు తెరకెక్కింది. 

ఎవరెలా నటించారంటే:

బోల్ట్ కాశీ పాత్రలో విజయ్‌ సేతుపతి తనదైన నటన కనబరిచాడు. యోగి బాబు ఎప్పటిలాగే కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. యోగి బాబు కామెడీకి ఆడియన్స్ ఫిదా అయ్యేలా నటించారు. సీరియ‌స్ సిట్యూవేష‌న్‌లో యోగిబాబు వేసే పంచ్‌లు వ‌ర్క‌వుట్ అయ్యాయి. రుక్మిణి వసంత్ తన అందంతో,నటనతో మెప్పించింది. దివ్యా పిళ్లై కూడా తనదైన పాత్రలో స్పెషల్ గా కనిపించింది. విలన్ గా అవినాష్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. 

సాంకేతిక అంశాలు:

జస్టిన్ ప్రభాకరన్ తెలుగు పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ. సామ్ సి.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. కెమెరామెన్‌ కరణ్‌ బి రావత్‌ విజువల్స్ బాగున్నాయి. ఫెన్సీ ఆలివర్‌ ఎడిటింగ్‌ కు పనిచెప్పాల్సి వస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అరుముగ కుమార్ దర్శకనిర్మాతగా పర్వాలేదనిపించాడు. కథలో ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది.