రివ్యూ: వారసుడిగా విజయ్ మెప్పించాడా.?

రివ్యూ: వారసుడిగా విజయ్ మెప్పించాడా.?

తమిళ హీరో విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భోగి పండగ రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న  తమిళ్ లో వారిసుగా విడుదలైన ఈ మూవీ.. అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరి వారసుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా..? 

కథేంటంటే..?

రాజేంద్రన్ (శరత్ కుమార్) కోటీశ్వరుడు. మైనింగ్ వ్యాపారి.  అతనికి ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్,) అజయ్ (కిక్ శ్యామ్), విజయ్ (విజయ్). ఎంతో కష్టపడి బిజినెస్ టైకూన్ గా ఎదిగిన రాజేంద్రన్ తన వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అయితే అప్పుడే ఫారిన్ లో చదువు ముగించుకుని వచ్చిన విజయ్ ను ఓ ఫంక్షన్ లో అందరికి పరిచయం చేస్తాడు. అయితే తన ముగ్గురు కుమారుల్లో ఎవరైతే తమ టాలెంట్ నిరూపించుకుంటారో వారినే వారసుడిగా ప్రకటిస్తానని రాజేంద్రన్ చెప్తాడు. అది ఇష్టం లేని విజయ్..తండ్రికి కొంతకాలం దూరంగా ఉంటాడు. తల్లి సుధ (జయసుధ) వద్దని వారించినా.. విజయ్ కుటుంబానికి దూరంగా ఉంటూ ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. అయితే రాజేంద్ర సామ్రాజ్యంపై కన్నేసిన జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) అతన్ని మట్టికరిపించాలని అనుకుంటాడు. కుటుంబం విడిపోయిన బాధలో ఉన్న సుధ .. షష్ఠి పూర్తి చేసుకోవాలని అనుకుంటుంది. తల్లి పిలుపుతో ఏడేళ్ల తర్వాత విజయ్ మళ్లీ ఇంటికి తిరిగొస్తాడు. అదే సమయంలో రాజేంద్రన్ కు తాను ఎక్కువ కాలం బ్రతకనన్న విషయం తెలుస్తుంది. ఈ సమయంలో తన తర్వాత సంస్థ చైర్మన్ పదవిని పెద్ద కొడుకుల్లో ఒకరికి అప్పగించాలని భావిస్తాడు. కోలాహలంగా జరుగుతున్న షష్ఠిపూర్తి కార్యక్రమం అనూహ్య పరిణామాల మధ్య ఆగిపోతుంది. పెద్ద కొడుకుల అసలు రంగు బయటపడుతుంది. వారిద్దరి వల్లే రాజేంద్రన్ వ్యాపారం దెబ్బతిన్నదని.. వారు ప్రత్యర్థికి లొంగిపోయారని నిజం తెలుస్తుంది. మళ్లీ ఇంటి నుంచి వెళ్లాలనుకున్న విజయ్ కి డాక్టర్ ఆనంద్ (ప్రభు) ద్వారా అసలు నిజం తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో విజయ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని వారసుడిగా ఎలా ఎదిగాడు అన్నది మిగిలిన స్టోరీ.

ఎలా ఉందంటే..?

వారసుడు తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. తండ్రి, కొడుకులు, స్వార్థంతో కూడిన విలన్. తండ్రిని మోసం చేసే అన్నదమ్ములు. వారిని కలిపేందుకు ప్రయత్నించే హీరో. అయితే ఈ స్టోరీని విజయ్ సెలక్ట్ చేసుకోవడం కొద్దిగా కొత్తగా ఉంది. ఈ సినిమాలో విజయ్ తనదైన శైలిలో నటించాడు. ఈ సినిమాకు విజయ్ నటనే ప్లస్. విజయ్ వదిన చెల్లెలు దివ్యగా నటించిన రష్మిక పాత్ర నిడివి తక్కువే అయినా..ఆకట్టుకుంది. యోగి బాబు కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటులు జయసుధ, శరత్‌కుమార్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, ప్రకాష్‌రాజ్‌ స్టోరీకి తగ్గట్లు వారి పాత్రలకు న్యాయం చేశారు.  టెక్నికల్‌గా వారసుడు పర్వాలేదనిపిస్తుంది. కార్తీక్ పళని విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. థమన్  మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. రంజితమే, వా తలపతి సాంగ్స్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయాయి. సెంటిమెంట్ సీన్లలో బీజీఎమ్ బాగా వర్కౌట్ అయింది.