కుభీర్, వెలుగు: ప్రతి ఒక్క కూలీకి వంద రోజుల పని కల్పించాలని నిర్మల్ డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి ఆదేశించారు. బుధవారం కుభీర్మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో రూ.10,66,12,077తో జరిగిన పనులకు గాను సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి రూపొందించిన నివేదికలను ప్రజావేదికలో చదివి వినిపించారు.
రూ.42,648 పెనాల్టీ, రికవరీకి ఆదేశించారు. నిగ్వ గ్రామపంచాయతీలో రూ.6 లక్షల సీసీ రోడ్డు పనులకు సంబంధించి రికార్డులు ఇవ్వలేదని తనిఖీ బృందం తెలిపింది. ఈ సందర్భంగా డీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగ సాగర్ రెడ్డి, ఏపీఎం హరిలాల్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
