ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ టూ చెన్నై వందేభారత్

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త..  విజయవాడ టూ చెన్నై వందేభారత్

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ -చెన్నై  రూట్ లో నడపాలని కేంద్రం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. కొంత కాలంగా ఈ రైలుపై కసరత్తు చేసిన అధికారులకు తాజాగా రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించింది. ఈ నెల 7న ప్రారంభ ముహూర్తంగా నిర్ణయించారు. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చ్యువల్ గా ప్రారంభించనున్న జాబితాలో ఈ రైలును చేర్చారు. రూటు.. ధరలు ఖరారు చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి రైలు రాకపోకలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ లైన్ లో రద్దీ…డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ మార్గానికి అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. సెమీ-హై-స్పీడ్ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. 

 ఈ రైలును రేణిగుంట మార్గం గుండా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు విన్నవించినట్లు సమాచారం.   గూడూరు, రేణిగుంట, కాట్పాడి స్టేషన్లలో ఆగుతూ చెన్నై వెళ్లి.. అదే రూటులో తిరిగి రానుంది. విజయవాడ- తిరుపతి మధ్య ప్రయాణించే పాసింజర్స్ రద్దీ నేపథ్యంలో.. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని  నిర్ణయించారు. . విజయవాడ, చెన్నై మధ్య కేవలం 6.30 గంటల్లోనే ప్రయాణించవచ్చు. ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణించే ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి మరో రైలు అందుబాటులోకి వస్తుంది.