పెళ్లి పేరుతో యువకుడి మోసం

పెళ్లి పేరుతో యువకుడి మోసం

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించారు..వారి సమక్షంలో నిశ్చితార్దం కూడా జరిగింది. అయితే నిశ్చితార్దం జరిగిన అబ్బాయి ఆ అమ్మాయిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో కటకటాల పాలయ్యాడు. వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల ఇప్పాయపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో స్టాప్ నర్సు గా పనిచేసేది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం అంచ న్ పల్లి గ్రామానికి చెందిన మనోహర్(24)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ఇష్టపడ్డారు. మూడేళ్ళుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తేలియడం.. ఒకే కులానికి చెందిన వారు కావడంతో అంగీకరించారు. 

2021 డిసెంబర్ 10న పెద్దల సమక్షంలో వీరికి నిశ్చితార్దం నిర్వహించారు. అనంతరం వీరిరువురు పెళ్ళి కాకుండానే హైదరాబాద్ లో ఒకే గదిలో ఉంటూ తమ ఉద్యోగాలకు వెళ్ళేవారు. ఈ క్రమంలో గత మూడు నెలల నుండి కుటుంబసభ్యులు యువతికి పెళ్లి చెయ్యాలని ఏర్పాట్ల కోసం సిద్దమవుతుండగా మనోహర్ అందుబాటులో లేకుండా పోయాడు. ఎంతకు రాకపోవడంతో ఆరా తీయగా మనోహర్ మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు కులక్చర్ల పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మనోహర్ పై యువతిని మోసగించినందకు పలు సెక్షన్ల కింద  కేసు  నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా వినకుండా కేసు చేస్తే చెయ్యండని చెప్పడం గమనార్హం. నెల రోజులుగా పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతున్న నాకు న్యాయం జరగడం లేదని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.