రాకంచెర్ల ప్రమాదంలో ఒకరు మృతి.. మరో నలుగురికి  కొనసాగుతున్న ట్రీట్మెంట్

రాకంచెర్ల ప్రమాదంలో ఒకరు మృతి.. మరో నలుగురికి  కొనసాగుతున్న ట్రీట్మెంట్

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్​జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్​కు తరలించేలోపే 18 ఏళ్ల పూజ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ నుంచి బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల తండాలోని బంధువుల వివాహానికి ఆటోలో వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణానాయక్, కవితా బాయి, పూజ, శ్రీనివాస్, అక్షితలను వికారాబాద్​లోని ఈషా ఆసుపత్రికి తరలించగా, పూజ అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి ఎండీ డాక్టర్ భరత్ రెడ్డి తెలిపారు. మిగిలిన నలుగురిలో ఇద్దరి కాళ్లు విరగగా, అందరి తలకు బలమైన గాయాలయ్యాయని, వీరికి ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పొన్నల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చెన్గోముల్ ఎస్సై భరత్ రెడ్డి తెలిపారు.