నల్గొండ,యాదాద్రి జిల్లాల్లో ఇవాళ్టి (జూన్ 4) నుంచి గ్రామ, వార్డు సభలు

 నల్గొండ,యాదాద్రి జిల్లాల్లో ఇవాళ్టి (జూన్ 4) నుంచి గ్రామ, వార్డు సభలు

యాదాద్రి/నల్గొండ, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో విడతల వారీగా గ్రామ, వార్డు సభల నిర్వహణకు రంగం సిద్ధమైంది. యాదాద్రి జిల్లాలోని 427 పంచాయతీలలో నాలుగు విడతలుగా , 6 మున్సిపాలిటీల్లోని 104 వార్డుల్లో ఈ సభలు జరగనున్నాయి. 

తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సభలకు హాజరై సాలిడ్ వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ రూల్స్-2026, తడి-పొడి చెత్త వేరు చేయడం, పరిశుభ్రత, వర్షాకాల సన్నద్ధత, తాగునీటి సరఫరా, ప్రజారోగ్య పరిరక్షణ లాంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన 
కల్పించనున్నారు. 

పంటల మార్పిడి వ్యూహాం అమలు.. 

ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, రైతులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ శాఖ ‘క్రాప్ డైవర్షన్’ (పంటల మార్పిడి) న్ని అమలు చేస్తోంది. ఒకప్పుడు నల్గొండ జిల్లా బత్తాయి సాగుకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా ఉంది. ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, తెగుళ్లు, కోల్డ్ స్టోరేజ్ లాంటి సదుపాయాలు లేకపోవడంతో బత్తాయి సాగు 4 లక్షల ఎకరాల నుంచి 45 వేల ఎకరాలకు పడిపోయింది. 

మార్కెట్‌‌‌‌లో సరైన ధర లేకపోవడం, డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు తగ్గడం వల్ల 2025-–26 కాలంలోనే దాదాపు 4 వేల ఎకరాల్లో బత్తాయి తోటలను తొలగించి రైతులు వరి సాగు చేశారు. అయితే నీటి లభ్యత తగ్గనున్న తరుణంలో కేవలం వరి వేస్తే పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు ప్రత్యేక సభలు నిర్వహించనున్నారు. 

సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలికి, తక్కువ నీటితో పండే పత్తి, మిరప, సోయాబీన్, పప్పుధాన్యాలు, వేరుశనగ లాంటి ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను  ప్రోత్సహించేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం జిల్లాలో 22 వేల నుంచి 25 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ పంటకు రోజుకు 250 లీటర్ల నీరు అవసరం కాబట్టి, భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల రైతులు మార్కెట్ డిమాండ్, మద్దతు ధరలను బట్టి ఇతర వాణిజ్య పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.