- రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి
- ఎంపీ రఘునందన్ రావు
రామాయంపేట, వెలుగు: పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. రామాయంపేట మండలం అక్కన్నపేట జడ్పీ హైస్కూల్ లో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టం, ఎల్ఈడీ టీవీని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం, సిలబస్, విద్యాబోధన తీరును తెలుసుకున్నారు.
అక్కడినుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి, వికసిత్భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ ను వీబీజీ రామ్‌జీగా మార్చామని ప్రజలకు వివరించారు. గతంలో 100 రోజులు ఉన్న పని దినాలను ప్రస్తుతం 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ప్రజల బాగు కోసం ఈ పథకంలో మార్పులు చేస్తే సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఈ రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం రూ.1,250 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లతోపాటు రైతులకు కల్లాల ఏర్పాటు, షెడ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కూలీలకు నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభం
మెదక్(చేగుంట), వెలుగు: చేగుంట మండలంలోని వడ్యారం రైల్వే స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కౌంటర్ ను బుధవారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. చేగుంట, నార్సింగి, వడియారం ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రయాణికుల కోరిక మేరకు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే కూలీలకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో దేవగిరి ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లను చేగుంటలో ఆపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
