
- రెవెన్యూ సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారిని నియమిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి జీపీవోలుగా చేరేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్‌తో కలిసి రెవెన్యూ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల గ్రామ పరిపాలనాధికారులుగా అవకాశం కల్పించడానికి గతంలో వీఆర్వో, వీఆర్ఏ గా చేసిన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 3,454 మంది అర్హత సాధించారు. అయితే 10 వేలకు పైగా గ్రామాలు ఉండటంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో అవకాశం కల్పించి, దీనికి సంబంధించిన అర్హత పరీక్షను త్వరలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని, అదేవిధంగా ప్రజలకు రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని జీపీవోల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వివరించారు. అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులు విజయవంతమయ్యాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, తెలంగాణ తహశీల్దార్ల సంఘం అధ్యక్షులు కె.రాములు, తెలంగాణ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షులు బి.రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, ట్రెసా అనుబంధ అధ్యక్షులు పి.రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల జాబ్‌చార్ట్‌ను పునఃసమీక్షించాలి: లచ్చిరెడ్డి
కొత్తగా రానున్న గ్రామ పాలన అధికారుల(జీపీవోల) కోసం ప్రతి రెవెన్యూ గ్రామంలో కార్యాలయ స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. జూనియర్ అసిస్టెంట్ల నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు అన్ని స్థాయిల రెవెన్యూ ఉద్యోగుల విధులను పునఃసమీక్షించి, జాబ్ చార్ట్ రూపొందించి ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆయన కోరారు. జిల్లాలు, జోన్లలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు ఉద్యోగుల పరస్పర అంగీకార బదిలీల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు.