కిడ్నాప్ కేసును పట్టించుకోవట్లే
సీపీ ఆఫీసు ముందు బుడగ జంగాల ధర్నా
ధర్నా చేసిన బాధితులపై కేసు నమోదు
హనుమకొండ, వెలుగు : గుర్తుతెలియని వ్యక్తులు తమ బంధువును కిడ్నాప్ చేశారని, స్థానిక పోలీసులకు కంప్లైంట్చేసినా సరిగ్గా స్పందించడం లేదని హసన్పర్తి, ముల్కనూరు గ్రామాలకు చెందిన బుడగ జంగాలు సోమవారం ధర్నాకు దిగారు. వరంగల్ సీపీ ఆఫీసు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చిత్తారి కోటిలింగం అనే వ్యక్తి బోర్ వెల్స్ నడిపిస్తున్నాడని, ఆదివారం మధ్యాహ్నం చర్చికి వెళ్లి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపారు, స్థానిక పీఎస్కు వెళ్తే అక్కడ ఎవరూ రెస్పాండ్ కాలేదని ఆరోపించారు.
ఒక స్టేషన్కు వెళ్తే.. ఇంకో స్టేషన్కు వెళ్లమని తిప్పి పంపించారని.. మట్వాడా, సుబేదారి స్టేషన్లకు వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. చివరికి హనుమకొండ పోలీసులు వచ్చి వారికి సమాధానం చెప్పగా.. ఆందోళన విరమించారు. కాగా రేషన్ బియ్యం దందా ఆరోపణలతో వరంగల్ టాస్క్ ఫోర్స్పోలీసులు కోటిలింగంను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉంటే పోలీస్ పర్మిషన్ లేకుండా అకస్మాత్తుగా ధర్నాకు దిగారని, ట్రాఫిక్ కు అంతరాయం కల్పించారనే కారణాలతో బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.