15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఏడ ఉండాలె

15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఏడ ఉండాలె

లోకేశ్వరం, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న  పంచగుడి గ్రామస్థులు పదిహేను రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఎక్కడ ఉండాలంటూ ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని నిలదీశారు.  నిర్మల్ నిజామాబాద్ జిల్లాలను అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణం కోల్పోతున్న పంచగుడి గ్రామస్థులకు బుధవారం లోకేశ్వరంలో ఎమ్మెల్యే నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చారు.  ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేసి ఇళ్లు నష్టపోతున్న వారి జాబితాను తయారుజేశారు. ఇప్పుడు చెక్కులు పంపిణీ చేసి 15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చెప్పడంతో ఎక్కడ ఉండాలంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అప్పుడు మూడు నెలల గడువు ఇస్తామని అధికారులు చెప్పారని, అధికారులకు, నాయకులకు మధ్య అవగాహన లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.  

కొంతమంది బాధితులు నష్టపరిహారం చెక్కులు తీసుకోకుండా వెళ్లిపోయారు.  ఇల్లు ఖాళీ చేయడానికి నాలుగు నెలలు గడువు ఇస్తేనే చెక్కులు తీసుకుంటామని బాధితులు తెగేసి చెప్పారు.  వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున ఇల్లు ఖాళీ చేయడం ఎలా అని వారు ప్రశ్నించారు.  ఏడు సంవత్సరాల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం అప్పటి ధరలతో పోల్చితే ఇళ్ల నిర్మాణం ఖర్చులు మూడు రేట్లు పెరిగాయని, ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం సరిపోదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.