
మెదక్(శివ్వంపేట)/ కంగ్టి , వెలుగు: అధ్వానంగా మారిన రోడ్లను ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా రోడ్లు బురదమయంగా మారడంతో కాలినడకన సైతం వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బురదమయంగా మారిన రోడ్లపై గ్రామస్తులు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రెడ్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంక్యా తండా, రూప్ సింగ్ తండాకు మట్టి రోడ్డు ఉంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రోడ్లు చిత్తడిగా మారాయి. శనివారం ఆయా తండా వాసులు బురదమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తమ తండాలకు రోడ్డు సౌకర్యం మెరుగుపర్చాలని సర్పంచ్ రంగీలా కోరారు. కంగ్టి మండల పరిధిలోని వాచు తండాలోని రోడ్లపై కూడా నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తండాలను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వెంటనే తండాలకు రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు.