బేతిగల్ కు జాండీస్ భయం..నెల రోజుల్లో 100 మందికిపైగా అస్వస్థత

బేతిగల్ కు జాండీస్ భయం..నెల రోజుల్లో 100 మందికిపైగా అస్వస్థత

 

  • కలుషిత తాగునీటితోనే అని గ్రామస్తుల అనుమానాలు
  • వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామస్తులు జాండిస్ భయంతో వణికిపోతున్నారు. రోజుల తరబడి జ్వరం రావడం టెస్టుల్లో జాండిస్ అని తేలుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున సుమారు 100 మంది వరకు జాండిస్ బారినపడినట్లు తెలిసింది. జాండిస్, డెంగ్యూ లక్షణాలతో కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. తాగునీరు కలుషితం కావడంతోనే జాండిస్ బారినపడుతున్నారని డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  

ఇండ్ల మధ్య వాననీరు.. డ్రైనేజీల్లో మురుగు 

బేతిగల్ లో ఇండ్ల మధ్యనే వాన నీరు, డ్రైనేజీల్లో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో దోమలు వృద్ధి చెందడంతో జ్వరాల బారినపడడానికి కారణమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ ట్యాంకుతో పాటు రెండు వాటర్ ప్లాంట్ల నుంచి తెచ్చుకుంటున్న నీళ్లను తాగుతున్నారు. నీళ్లు కలుషితం కావడంతో జాండిస్ బారినపడుతున్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

గ్రామంలో హెల్త్ క్యాంప్.. ఫీవర్ సర్వే

 బేతిగల్ గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ అధికారులు  వారం కింద హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టగా..15 మంది జాండిస్ బారినపడినట్లు గుర్తించారు. వరంగల్ రీజినల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ఆఫీసర్ డాక్టర్‌‌ కృష్ణారావు గ్రామంలోని వాటర్ ప్లాంట్లతోపాటు మిషన్ భగీరథ నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌‌కు పంపించారు.  

కలుషిత నీటితోనే జ్వరాలు

మా పిల్లలకు రెండు నెలల్లో రెండు, మూడు సార్లు జ్వరం వచ్చింది. టెస్టులు చేయిస్తే జాండిస్ అని తేలింది. కరీంనగర్ లో డాక్టర్లను అడిగితే తాగే నీళ్ల వల్ల వచ్చి ఉండొచ్చంటున్నారు. జ్వరంతోపాటు రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గడం లాంటి డెంగ్యూ లక్షణాలు ఉంటున్నాయి. మోరీల్లో దోమలు, కలుషిత నీటిని తాగడంతోనే జనాలంతా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంత జరిగినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. - ఓదెలు, గ్రామస్తుడు  మా బాబుకు టెస్టులు చేస్తే జాండిస్  

మా బాబుకు జ్వరమొస్తే  ఆర్ఎంపీ వద్ద చూపించినం. అక్కడ తగ్గకపోతే సర్కార్ దవాఖానకు తీసుకెళ్లినం. అక్కడా నయం కాకపోవడంతో  కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినం. టెస్టులు చేసి జాండిస్ అని డాక్టర్ చెప్పారు.  బాబుకు పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికే రూ.40 వేలు ఖర్చుచేసినం.  - ముద్దమల్ల ప్రతాప్, గ్రామస్తుడు 

ఇంటింటి సర్వే చేస్తున్నాం

బేతిగల్ లో  రెండు నెలల నుంచి జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని తెలిసిన వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాం. జ్వరం వచ్చినవారు ఉంటే మెడిసిన్ తో పాటు ట్రీట్ మెంట్ చేస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. పూర్తిస్థాయిలో జ్వరాలు తగ్గేంతవరకు మెడికల్ క్యాంపు కొనసాగిస్తాం.    - డాక్టర్ వరుణ, వీణవంక మెడికల్ ఆఫీసర్