ప్రజాకవులు, కళాకారులతో ఉద్యమ సంబంధం ఉన్నట్లే అందెశ్రీతోనూ నాకు ఉద్యమ సంబంధం ఉంది. కానీ, ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ఇష్టపడని అన్న, నీది నాది మాయిముంత సంబంధం (ఒకే ఊరిలో పుట్టడం) అని చెబుతూ, మా ఆడబిడ్డవని చాటుతూ అక్కా అంటూ ప్రేమగా సంబోధించేవాడు.
మా ఇద్దరి అమ్మమ్మల ఊరు ఆనాటి వరంగల్ జిల్లా లద్దునూరు గ్రామం కావడమే ఈ మాయిముంత సంబంధమట. ‘అందుకే కామ్రేడ్ అమర్ ని బావా అని పిలవాలి. కానీ ఆయన విప్లవకారుడు కాబట్టి నేను సార్ అని పిలుస్తాను’ అని ఎంతో గౌరవంగా, ఆత్మీయంగా చెపుతూ ఉండేవాడు. మిత్ర సాహిత్య కృషిని గౌరవిస్తానని చెబుతుండేవాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఒకరోజు ఆయన నివాసం ఉంటున్న లాలాపేట ఇంటికి పోయినప్పుడు చాలా నైరాశ్యంలో ఉన్నాడు. చిన్న ఇల్లు, సాధారణ జీవితం నన్ను అబ్బురపరిచింది.
లోక కవి అందెశ్రీ
నిజమైన కమ్యూనిస్టులా కనిపించాడు. వదినా ఒకసారి మా ఆఫీసుకు రమ్మని అన్న శ్రీమతిని పిలిచినప్పుడు ‘మీ వదినను మీ దగ్గరే ఉంచుకోండమ్మా, నేనిక ప్రపంచ నదుల వెంట సాగిపోతాను’ అని చెప్పాడు. ఆ సమయంలో 'నిప్పుల వాగు' సంకలనం ఆయనకు కొంత ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. ఆయన మరణించిన రోజు నేను కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ కోసం నకిరేకల్‌లో ఉన్నాను. అప్పటికే అమర్ వచ్చి అందెశ్రీ పార్థివదేహానికి నివాళులర్పించి వెళ్లిపోయాడు.
లోక కవిగా అందనంత ఎత్తుకు ఎదిగిన డాక్టర్ అందెశ్రీ స్మృతిలో కామ్రేడ్ మిత్ర రచించిన పాటను నకిరేకల్‌లో ఉండి కూడా ఫోన్ ద్వారా పాడుతూ... అన్ని చానళ్లలో నా వాయిస్ ఇవ్వడంతో పాటు, పాట కూడా పాడాను. తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోకు కూడా ఫోన్ ఇన్ వాయిస్ ఇచ్చాను. నవంబర్ 10వ తేదీన రాత్రి అయినా వచ్చి పార్థివదేహం వద్ద ప్రజాకలంగా- జన గళంగా ప్రసిద్ధిగాంచిన అందెశ్రీకి మిత్ర కలాన్ని, నా గళాన్ని జోడించి పాటతో నివాళులర్పించాను.
పని పుట్టకు ముందే పాట
‘నిప్పుల వాగు’ సంకలనం కోసం మిత్ర పాటలు అడగడానికి, ఆ పాటల కరెక్షన్స్ తీసుకోడానికి కూడా అందెశ్రీ అనేకసార్లు అరుణోదయ ఆఫీసుకు వచ్చాడు. గద్దర్, గోరటి వెంకన్నల కంటే ఎన్నోసార్లు మా కార్యాలయానికి వచ్చి గంటల తరబడి కూర్చుండి చర్చించేవాడు. పని (ఉత్పత్తి) పుట్టక ముందే పాట ధ్వనిలో పుట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. శ్రామిక విప్లవాల వెనుకడుగు తర్వాత మీరేమి చేయాలనుకుంటున్నారని ఎన్నో విషయాలు చర్చించేవాడు.
ఉద్యమ కాలంలో ఎన్నో వేదికలు పంచుకున్నా ఉద్యమ గౌరవంతో పాటు తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కే ఆత్మీయ గౌరవమే ఆయన నుండి నాకు దొరికేది. ఈ అనుబంధం ఇతర కవి- గాయకులతో భిన్నంగా అనిపించేది. అందుకే అమర్ - నేను రెండు రోజుల వీడ్కోలు కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నాం.
'సుద్దాల హనుమంతు-జానకమ్మ'ల జాతీయ పురస్కారం నాకు లభించినప్పుడు సుద్దాల హనుమంతుపై మిత్ర రాసిన పాటను ఆలపించాను. ఆ పాట విని దిగ్గున లేచి స్టేజీపైకి వచ్చాడు. ‘అక్కా నీకు సన్మానం చేయాలని’ వచ్చి శాలువా కప్పాడు. ‘అన్నా సభ తర్వాత చేయండే’ అని చెప్పినా వినలేదు.
తరువాత తన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఆమోదించినప్పుడు వేదిక మీద నిలబడిన ఆయన భావోద్వేగాలు తెలంగాణ సమాజమంతా చూసింది. కవికి ఒక ప్రాపంచిక దృక్పథం, తాత్విక చింతన ఉండడం ఒక ఎత్తయితే, తానే నదీ నాగరికత మూలాలు వెతుకుతూ ప్రపంచమంతా తిరిగి రావడం గుర్తించదగ్గ విషయం. ప్రజా కవి, గాయకుడుగా అందెశ్రీ కి జోహార్లు అర్పిస్తూ ఆయన నుంచి నేర్చుకునే అంశాలు అన్నిటిని తప్పక నేర్చుకుంటాం.
విమలక్క, గౌరవాధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
