రెండు వారాల శాంతి తర్వాత.. మణిపూర్​లో మళ్లీ హింస

 రెండు వారాల శాంతి తర్వాత.. మణిపూర్​లో మళ్లీ హింస

ఇంఫాల్: మణిపూర్​లో రెండు వారాల శాంతి తర్వాత మళ్లీ హింస చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఉఖ్రుల్ జిల్లా తవాయి గ్రామం వద్ద బంకర్ లో ఉండి కాపలా కాస్తున్న ముగ్గురిని సాయుధ దుండగులు కాల్చి చంపారు. అనంతరం మృతుల్లో ఒకరి డెడ్ బాడీని కత్తులతో పొడిచి ఛిద్రం చేశారు. తవాయి గ్రామంలో కుకీ తెగకు చెందిన 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామం చుట్టూ సంగ్కాయి, మాంగ్కోట్, జలెన్ బంగ్ వంటి గ్రామాల్లోనూ కుకీలు నివసిస్తున్నారు.

 రాష్ట్రంలో గొడవల నేపథ్యంలో తవాయి గ్రామానికి రక్షణగా కిలోమీటర్ దూరంలో గ్రామస్తులు బంకర్ ఏర్పాటు చేసుకున్నారు. బంకర్ లో నలుగురు చొప్పున గ్రామ రక్షణ దళం వాలంటీర్లు ఇరవై నాలుగు గంటలూ కాపలా కాస్తున్నారు. శుక్రవారం ఉదయం డ్యూటీ దిగే సమయానికి ఓ వాలంటీర్ ఇతరులను డ్యూటీకి పిలిచేందుకు గ్రామంలోకి వెళ్లాడు. ఇంతలో కాల్పుల శబ్దం వినిపించడంతో గ్రామస్తులు, వాలంటీర్లు బంకర్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. 

అప్పటికే దుండగుల కాల్పుల్లో ముగ్గురు వాలంటీర్లు చనిపోయారు. ఆ తర్వాత వాలంటీర్లకు, దుండగులకు మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయని గ్రామస్తుడు ఒకరు తెలిపారు. దుండగులు పారిపోయిన తర్వాత బంకర్ లోని డెడ్ బాడీలను వెలికి తీసి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.