మణిపూర్​లో హింస మొదలైందిలా.. కారణాలివే..

మణిపూర్​లో హింస మొదలైందిలా.. కారణాలివే..

మైతీ తెగకు ఎస్టీ హోదా.. వ్యతిరేకిస్తున్న కుకీలు
ఇంఫాల్: మణిపూర్.. రెండు నెలలుగా హింసతో రగిలిపోతున్నది. కొండ ప్రాంతాల్లో నివసించే మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే హైకోర్టు తీర్పును కుకీ, నాగా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మే 3న చురాచంద్​పూర్ జిల్లాలో చేపట్టిన ‘గిరిజన సంఘీభావ నిరసన యాత్ర’ ఇప్పటి అల్లర్లకు కారణమైంది. ర్యాలీ టైంలో ఓ సాయుధ గుంపు మైతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దాడి చేసింది. ఇది ప్రతీకార దాడులకు దారితీసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ రోజు మొదలైన ఘర్షణలు నేటికీ కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు, ఇండ్లు తగుల బెట్టుకోవడం, దోపిడీలు, హత్యలు కాస్తా మహిళలపై అత్యాచారాల దాకా తీసుకెళ్లింది. ఎస్టీ హోదా అడ్డుకుంటున్న కుకీ తెగకు చెందిన మహిళలు, యువతులు లక్ష్యంగా మైతీ వర్గం రేప్, హత్యలకు పాల్పడుతోంది.

కుకీలు ఎవరు?
ఇండియాలోని అనేక కొండ జాతి తెగల్లో కుకీలు ఒకటి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, మేఘాలయ, అస్సాం, త్రిపుర, నాగాలాండ్​లో నివసిస్తారు. కుకీలు ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. మణిపూర్​లోని చురాచంద్​పూర్ వారికి బలమైన కోట. రాష్ట్ర జనాభాలో 40% ఉన్నారు. వీరిలో మళ్లీ 20 ఉప తెగలున్నాయి. చాలా ఏండ్ల కింద కుకీ తెగకు చెందినవాళ్లు క్రైస్తవ మతంలోకి మారారు. కొండ ప్రాంతాల్లో వీళ్లు ఉండొచ్చు. కానీ, ఆ స్థలాలు అమ్మడానికి లేదు. 


మైతీలు ఎవరు?
మణిపూర్‌లో మైతీలు ఎక్కువగా ఉంటారు. వీరంతా హిందువులు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటారు. ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరంతో పాటు పలు రాష్ట్రాల్లో వీరి జనాభా ఎక్కువే ఉంది. మైతీలను మణిపూర్ మూల వాసులుగా చెబుతుంటారు. మైతీ ప్రజల స్థలాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. రాష్ట్ర జనాభాలో 53 శాతానికి పైగా ఉన్నారు. 


ఎస్టీ హోదా కోసం మైతీల డిమాండ్​
కుకీల మెప్పు పొందేందుకు అడవులు మీవే అంటూ అన్ని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. దీంతో మయన్మార్, బంగ్లాదేశ్​లో ఉండే కుకీలను ఇక్కడి వాళ్లు పిలిపించుకోవడం ప్రారంభించారు. వాళ్లకు ఆధార్ కార్డులు ఇప్పించుకుంటూ జనాభా పెంచుకున్నారు. అక్రమ వలసలతో మైతీల ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై దెబ్బపడింది. తాము ఉనికి కోల్పోతామనే భయంతో ఎస్టీ హోదాకు డిమాండ్ చేశారు. ఎన్​ఆర్సీ అమలు చేసి అక్రమ వలదారులను (రోహింగ్యాలు) తిరిగి పంపించాలని కోరారు. యూసీసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. 


మే 3 నుంచి రాష్ట్రంలో హింస.. 

మణిపూర్.. బంగ్లాదేశ్, మయన్మార్ బార్డర్​లో ఉంటుంది. 33 లక్షల జనాభా. మైతీ వర్గానికి ఎస్టీ హోదా సిఫార్సును వ్యతిరేకిస్తూ కుకీ తెగ దాడులకు తెగబడింది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 160 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. సుమారు 60వేల మందిని ఇండ్ల నుంచి వెళ్లగొట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వాళ్లంతా అడవి బాట పట్టారు. హింసను అణిచివేసేందుకు ఆర్మీ, పారా మిలటరీ బలగాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.