చిల్లర పైసలతో స్కూటీ

చిల్లర పైసలతో స్కూటీ

బండి లేదా కారు కొనేందుకు డబ్బులు లేదా డెబిట్​ కార్డ్, క్రెడిట్​ కార్డు తీసుకొని వెళ్తారు ఎవరైనా.  కానీ, ఇతను మాత్రం ఒక బ్యాగ్​ నిండా చిల్లర పైసలు తీసుకెళ్లాడు. ఆ చిల్లర పైసలతోనే తనకు నచ్చిన స్కూటీ కొన్నాడు కూడా. అతని పేరు హఫిజుర్​ అకంద్​. అస్సాంలో చిన్న దుకాణం ఉంది అతనికి. రోజూ కొన్ని చిల్లర పైసల్ని దాచిపెట్టి తన కలని నిజం చేసుకున్నాడు ఇతను.
అస్సాంలోని బార్​పేట జిల్లాలో హఫిజుర్​కి చిన్న దుకాణం ఉంది. సరుకులు తెచ్చేందుకు తను కూడా ఒక స్కూటీ కొనుక్కోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అయితే, ఒకేసారి మొత్తం డబ్బు కట్టకున్నా, డౌన్​పేమెంట్​అయినా (రూ.30వేలు) కట్టి బండి తెచ్చుకోవాలి అనుకున్నాడు. కానీ, అంత డబ్బు కూడా అతని దగ్గర లేదు. దాంతో, రోజూ రూపాయి, రెండు రూపాయలు, 10 రూపాయల  నాణేల్ని  జమచేయడం మొదలుపెట్టాడు. అలా ఒక ఏడాదిలోనే ఆ బ్యాగ్​ నిండా కాయిన్స్​ పోగయ్యాయి. ఆ కాయిన్స్​తో బండి కొందామని బ్యాగ్​ తీసుకుని దగ్గర్లోని బైక్​  షోరూమ్​కి వెళ్లాడు.

3 గంటలు పట్టింది

షోరూమ్​ వరకు అయితే వెళ్లాడు. కానీ, ‘చిల్లర పైసలు తెచ్చాను’ అంటే వాళ్లు ఏమంటారోనని బయటే నిల్చున్నాడు. అతడిని గమనించిన సేల్స్​మెన్​ ఒకరు ‘ఏం కావాలి? ఎందుకలా ఇటువైపే చూస్తున్నావ్?’ అని అడిగాడు. ‘నేను స్కూటీ కొనడానికి వచ్చాను. అయితే, చిల్లర పైసలు తీసుకుంటారో? లేదో?నని ఆలోచిస్తున్నాను’ అని చెప్పాడు హఫిజుర్​. దాంతో ఆ సేల్స్​మన్ ‘ఏం టెన్షన్​ పడకు. మేం తీసుకుంటాం’ అని చెప్పి, ​ హఫిజుర్​ని షోరూమ్​లోకి తీసుకెళ్లాడు. అతని బ్యాగ్​లోని చిల్లర పైసల్ని ఒకచోట కుప్ప పోశాడు. అక్కడి సేల్స్​మేనేజర్​తో పాటు​ ఐదుగురు సేల్స్​మెన్​లు​ తలా కొంత చిల్లర తీసుకుని కష్టం అనుకోకుండా మూడు గంటలు లెక్కబెట్టారు. చిల్లర మొత్తం 22 వేల రూపాయలు అయింది. డౌన్​పేమెంట్​కి ఇంకా 8 వేలు తక్కువయ్యాయి. అతనికి షోరూమ్​వాళ్లు లోకల్​ బ్యాంక్ నుంచి ఫైనాన్స్​ ఇప్పించారు. దాంతో 30 వేలు డౌన్​పేమెంట్​ కట్టి సుజుకీ అవెనిస్​ స్పెషల్​ ఎడిషన్​ స్కూటీ తీసుకున్నాడు. షోరూమ్​వాళ్లు తీసిన కొన్ని ఫొటోలు, వీడియోని  హిరక్​ జె దాస్​ అనే యూట్యూబర్​ ఫేస్​బుక్​లో పెట్టాడు. ఈ వీడియో చూసినవాళ్లంతా హఫిజుర్​ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.  

వాళ్లకి థ్యాంక్స్​

‘నాకు చిన్న కిరాణ దుకాణం ఉంది. చాక్లెట్, చిప్స్​ కొనేందుకు వచ్చే చిన్నపిల్లలు ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు ఇచ్చేవాళ్లు. ఆ కాయిన్స్​ని ఒక బ్యాగ్​లో దాచేవాడిని. ఇప్పుడు ఆ కాయిన్స్​తోనే స్కూటీ డౌన్​పేమెంట్​ కట్టాను.  నా ప్రాబ్లమ్​ అర్థం చేసుకున్న డీలర్​, సేల్స్​మెన్​కు థ్యాంక్స్​”అని చెప్పాడు హఫిజుర్​.