కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.. కీలక విషయాలు బయటపెట్టిన డివిలియర్స్‌

కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.. కీలక విషయాలు బయటపెట్టిన డివిలియర్స్‌

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పునరాగమనం కోసం భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల నుంచి విరామం తీసుకున్న విరాట్, చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. దీంతో అతని గైర్హాజరిపై ఎన్నో ఊహాగానాలు తెరమీదకు  వస్తున్నాయి. కోహ్లీ తల్లికి బాగోలేదని కొందరు, అనుష్కతో సమయాన్ని గడుపుతున్నారని మరికొందరు, అతను విదేశాలకు వెళ్లారని ఇంకొందరు.. ఇలా ఎవరికీ తోచింది వారు ప్రచారం చేస్తున్నారు. ఈ ఊహాగానాలకు ఆర్సీబీ మాజీ క్రికెటర్, కోహ్లీ మిత్రుడు ఏబీ డివిలియర్స్‌ తెరదించారు. 

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన డివిలియర్స్‌.. విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. తాను కుటుంబంతో సమయం గడుపుతున్నారని, అందువల్లే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌‌లకు అతను దూరమైనట్లు వెల్లడించారు. ఇంతకుమించి తాను ఇంకేమీ ధృవీకరించబోనని అన్నారు. ఆపై కొద్దిసేపటికే కోహ్లీ- అనుష్క శర్మ జంట రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మధురక్షణాలు ప్రతి కుటుంబానికి చాలా ముఖ్యమైనవని, ఈ సమయంలో కోహ్లీ కుటుంబంతో గడపడం సరైన నిర్ణయమని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించారు.

మిగిలిన టెస్టులకు అనుమానమే..!

మొదటి రెండు టెస్టులకు దూరమైన విరాట్, చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడనేది అనుమానమే! అనుష్క శర్మ బిడ్డకు జన్మినిచ్చే సమయంలో తాను ఆమెతో ఉండాలనుకున్నారు కనుక ఆ క్షణాలు గడిచేవరకూ అతను జట్టుతో కలవకపోవచ్చనేది విశ్లేషకుల మాట. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రజిత్ పటీదార్ పర్వాలేదనిపిస్తున్నాడు. దీంతో మిగిలిన మూడు టెస్టులకు అతన్నే కొనసాగించవచ్చు.