సెలెక్షన్ కమిటీ ముందు కోహ్లీ ప్రపోజల్‌న్యూఢిల్లీ: టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ అనూహ్యంగా తప్పుకోవడానికి కారణాలేంటీ..? దీనికి సరైన కారణాలు తెలియకపోయినా, సెలెక్టర్ల ముందు కోహ్లీ పెట్టిన కొన్ని ప్రతిపాదనలు బెడిసికొట్టినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం. వన్డేల్లో కేఎల్ రాహుల్‌ను, టీ20ల్లో రిషబ్ పంత్‌ను తనకు డిప్యూటీగా నియమించాలన్న ప్రపోజల్స్‌తో కోహ్లీ కొన్ని రోజుల కిందట సెలెక్టర్లను కలిశాడు. రోహిత్ (34) ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోరాడు. కానీ దీనికి సెలెక్టర్లు ససేమిరా అనడంతో ఈ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఇక ఐసీసీ టోర్నీల్లో విరాట్‌కు సరైన రికార్డు లేకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా రాణించకపోతే.. కచ్చితంగా వన్డే, టీ20 టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని బీసీసీఐ నుంచి స్పష్టమైన హెచ్చరికలు వెళ్లినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ముందే టీ20 కెప్టెన్సీని వదిలేస్తే.. 2023 వన్డే వరల్డ్‌కప్ వరకు తనపై పెద్దగా ఒత్తిడి ఉండదనే భావన కూడా కోహ్లీలో మొదలైంది. కానీ వన్డే కెప్టెన్సీని కూడా అతను తొందరలోనే కోల్పోయే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
