జనాలకు మసాలా మిస్సయింది.. నేనలా చేయడం కొందరికి నచ్చలేదు: విరాట్ కోహ్లీ

జనాలకు మసాలా మిస్సయింది.. నేనలా చేయడం కొందరికి నచ్చలేదు: విరాట్ కోహ్లీ

కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్రౌండ్ లో దూకుడుగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వడం లేదు. ఒకప్పుడు ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే అసలు ఊరుకొని కోహ్లీ.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తనతో గొడవపడినవారిని కూడా మిత్రులుగా మార్చుకుంటున్నాడు. వరల్డ్ కప్ లో నవీన్ ఉల్ హక్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం..ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గంభీర్ తో హగ్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. 

ఐపీఎల్ లో భాగంగా  నేడు (ఏప్రిల్ 11) రాయల్ ఛాలెంజర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఒక కార్యక్రమంలో కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా గంభీర్ తో షేక్ హగ్..నవీన్ ఉల్ హక్ తో షేక్ హ్యాండ్ పై మాట్లాడాడు " గంభీర్, నవీన్ లను నేను హగ్ చేసుకోవడం కొంతమందికి నచ్చలేదు. అలా చేయడం ద్వారా వారికి మసాలా లేకుండా పోయింది. వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా నేను, నవీన్ సరదాగానే మాట్లాడుకున్నాం. అతను మ్యాచ్ ను త్వరగా ఫినిష్ చేయమని నాతో చెప్పాడు. నేను కూడా ఫినిష్ చేస్తానని సరదాగా అన్నాను". అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో 316 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా రాణిస్తున్నా.. జట్టు మాత్రం ఫ్లాప్ షో చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్ కు చేరాలంటే బెంగళూరుకు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.