17 ఏళ్లపుడు ఎలా ఉన్నాడో 33 ఏళ్లపుడూ అలాగే ఉన్నాడు

17 ఏళ్లపుడు ఎలా ఉన్నాడో 33 ఏళ్లపుడూ అలాగే ఉన్నాడు
  • 2006 రంజీ మ్యాచ్‌‌‌‌ను గుర్తు చేసుకున్నకోహ్లీ ఢిల్లీ టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ పునీత్‌‌‌‌ బిస్త్​

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరగబోయే ఫస్ట్ టెస్టుతో కెరీర్ లో100 టెస్టుల మైలురాయి చేరుకోబోతున్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో కోహ్లీ ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాడు. అందులో ఒకటి అతడి తండ్రి మరణం. 2006 రంజీ ట్రోఫీలో  కర్నాటకతో ఢిల్లీ మ్యాచ్‌‌‌‌ చివరిరోజు ఆటకు కొన్ని గంటల ముందు కోహ్లీ తండ్రి మరణించాడు. అప్పటికి విరాట్‌‌‌‌ వయస్సు 17 ఏళ్లు. అయినా కూడా ఆ బాధను దిగమింగి ఢిల్లీ టీమ్ కోసం కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించి క్రికెట్ పై తనకున్న ప్రేమ, పట్టుదలను చాటిచెప్పాడు.

ఈ విషయం చాలా మందికి తెలిసినా..  ఆ రోజు ఢిల్లీ డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో వాతావరణం, యంగ్‌‌‌‌ కోహ్లీ మానసిక పరిస్థితి గురించి ఈ నాడు  విరాట్‌‌‌‌తో కలిసి బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఢిల్లీ క్రికెటర్‌‌‌‌ పునీత్‌‌‌‌ బిస్త్​  వివరించాడు ‘తండ్రి చనిపోయిన బాధలోనూ  కోహ్లీ కర్తవ్యాన్ని మర్చిపోలేదు. తను అంతటి ధైర్యాన్ని ఎలా సంపాదించాడని ఈ రోజు వరకు నేను ఆశ్చర్యపోతూనే ఉన్నా.  ఆ విషాద సమయంలో మేమంతా షాకయ్యాం. కానీ ఆ కుర్రాడు (కోహ్లీ) మాత్రం బ్యాటింగ్‌‌‌‌కు రెడీ అయ్యాడు. అప్పటికి అతడి తండ్రి అంత్యక్రియలు పూర్తి కాలేదు. కానీ, మా టీమ్ గొప్ప పొజిషన్‌‌‌‌లో లేదు. ఆ పరిస్థితుల్లో మేము ఓ బ్యాటర్ ను కోల్పోవడం అతడికి ఇష్టం లేదు. మా కోచ్​, కెప్టెన్..​ కోహ్లీని ఇంటికి వెళ్లమని చెప్పారు. కానీ తను వెళ్లలేదు.

టీమ్‌‌‌‌ కోసం గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చాక బాధను పక్కకుపెట్టి మరింత దృఢంగా కనిపించాడు. ఆ కొన్ని గంటలూ తను ఏ విషయానికీ రియాక్ట్‌‌‌‌ అవ్వకుండా అద్భుతమైన షాట్స్ ఆడాడు. అప్పుడు మేం చాలా తక్కువగా మాట్లాడుకున్నాం. అతడు దగ్గరికి వచ్చినపుడల్లా మంచిగా ఆడు.. ఔట్ అవ్వకు అని మాత్రమే అంటుండేవాడు. నాకు మాత్రం ఏం చెప్పాలో అర్థమవలేదు. రంజీల కంటే ముందే నాకు కోహ్లీతో పరిచయం. గ్రౌండ్‌‌‌‌లో ఎప్పుడూ దూకుడుగా ఉండేవాడు. ఆ స్వభావం ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. కోహ్లీ 17 ఏళ్లపుడు ఎలా ఉన్నాడో 33 ఏళ్లపుడూ అలాగే ఉన్నాడు. అతడి స్వభావం ఏం మారలేదు’ అని కోహ్లీ వందో టెస్టు ముంగిట అప్పటి సందర్భాన్ని బిస్త్​ గుర్తుచేసుకున్నాడు.