కోహ్లీకి ఏమైంది?

కోహ్లీకి ఏమైంది?

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌ : బ్యాటింగ్‌‌‌‌లో అతనికి తిరుగులేదు..! ప్రత్యర్థులను భయపెట్టడంలో అతనికి ఎదురులేదు..! రికార్డులు కొల్లగొట్టడంలో అతనికి ఎవరూ సాటిరారు..! నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు కొడతాడు..! నిలబడితే..  ఫారిన్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై డబుల్‌‌‌‌ సెంచరీలు బాదేస్తాడు..! ఓవరాల్‌‌‌‌గా అతని బ్యాటింగ్‌‌‌‌ హీరోయిజానికి ఇంట్రడక్షనే అవసరం లేదు..! కానీ, కెప్టెన్సీ..? వరల్డ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ కెప్టెన్లలో ఒకరైన ‘ద గ్రేట్‌‌‌‌ ఎం.ఎస్‌‌‌‌ ధోనీ వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన కింగ్‌‌‌‌ కోహ్లీ.. ఐసీసీ ఈవెంట్లలో అట్టర్‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌ అవుతున్నాడు..! బైలేటరల్‌‌‌‌ సిరీస్‌‌‌‌ల్లో విజయాలు సాధిస్తున్నా.. మెగా టోర్నీల్లో ఫైనల్‌‌‌‌ అడ్డంకిని అధిగమించలేకపోతున్నాడు..! ఐదేళ్ల తన నాయకత్వంలో.. మూడు ఐసీసీ టోర్నీలు ఆడినా.. ఒక సెంచరీ కొట్టలేదు.. ఒక్ కప్‌‌‌‌ అందుకోలేదు..! 
దీంతో అతని బ్యాటింగ్‌‌‌‌, కెప్టెన్సీ స్కిల్‌‌‌‌పై కొత్త సందేహాలు మొదలయ్యాయి..! అదే టైమ్‌‌‌‌లో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్లూ పెరుగుతున్నాయి..! గతంలో ఎవరికి లేనంత అద్భుతమైన టీమ్‌‌‌‌.. అందుబాటులో బలమైన రిజర్వ్‌‌‌‌ బెంచ్‌‌‌‌.. ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌కు కొదవలేని ప్లేయర్లు.. తిరుగులేని ఆల్‌‌‌‌రౌండర్లు.. పటిష్టమైన పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌.. సూపర్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ ఉన్న కుర్రాళ్లు.. ఒకటేంటి.. టీమిండియాలో ఏ విభాగం తీసుకున్నా.. నైపుణ్యానికి, సామర్థ్యానికి తిరుగులేదు. కానీ ఇలాంటి టీమ్‌‌‌‌ను ఐసీసీ ఈవెంట్లలో నడిపించడానికి కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ విఫలమవుతున్నాడు. స్వదేశీ, విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌ల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా.. ప్రపంచ స్థాయి ఈవెంట్లలో వెనకడుగు వేస్తున్నాడు.  మెగా టోర్నీల్లో కెప్టెన్‌‌‌‌గా విరాట్‌‌‌‌ ఫోకస్ ఎందుకు తగ్గుతోంది? ఇప్పుడు క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 
చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ
జూన్‌‌‌‌ 2017లో జరిగిన చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా ఫేవరెట్‌‌‌‌. అంతకుముందే స్వదేశంలో ఒకటి, రెండు సిరీస్‌‌‌‌లు గెలవడంతో అందరూ విరాట్‌‌‌‌సేనదే టైటిల్‌‌‌‌ అని భావించారు. అదే స్థాయిలో లీగ్‌‌‌‌ దశలో టీమిండియా సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసింది. కానీ ఫైనల్‌‌‌‌కు వచ్చేసరికి.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌ చేతిలో ఘోరంగా చతికిలపడింది. కనీస పోటీ కూడా ఇవ్వలేదు. ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన పాక్‌‌‌‌ 338/4 స్కోరు చేసింది. బుమ్రా నో బాల్‌‌‌‌కు బతికిపోయిన ఫక్హర్‌‌‌‌ జమాన్‌‌‌‌ సెంచరీతో భారీ స్కోరు అందించాడు. ఛేజింగ్‌‌‌‌లో ఇండియా 158 రన్స్‌‌‌‌కు కుప్పకూలింది. ఇందులో విరాట్‌‌‌‌ స్కోరు 5 రన్స్‌‌‌‌. టోర్నీ మొత్తం సాలిడ్‌‌‌‌ షో చూపెట్టినా కప్‌‌‌‌ తీసుకురాలేకపోయింది. తన సారథ్యంలో ఫస్ట్‌‌‌‌ ఐసీసీ టోర్నీ కావడంతో విమర్శకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. 
వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌–2019
చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ తర్వాత విరాట్‌‌‌‌కు మరో రెండు చాన్స్‌‌‌‌లు వచ్చాయి. కానీ ఇందులోనూ కోహ్లీ మార్క్‌‌‌‌ ఎక్కడా కనిపించలేదు. 2019 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లోనూ మళ్లీ పరాజయమే ఎదురైంది. లీగ్‌‌‌‌ దశలో సూపర్‌‌‌‌గా రాణించినా.. నాకౌట్‌‌‌‌కు వచ్చేసరికి అదే ఒత్తిడి. మాంచెస్టర్‌‌‌‌లో జరిగిన కీలకమైన సెమీస్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో ఓడిన ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పుడున్న టీమ్‌‌‌‌, ఫామ్‌‌‌‌ను బట్టి కచ్చితంగా కప్‌‌‌‌ గెలుస్తుందని అందరూ భావించారు. కివీస్‌‌‌‌ 239/8 స్కోరు చేస్తే, ఇండియా 221 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఇందులో విరాట్‌‌‌‌ కేవలం ఒక రన్‌‌‌‌ మాత్రమే చేసి ఔటయ్యాడు. 
వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌
రెండేళ్ల పాటు జరిగిన వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టోర్నీలో ఆడిన ఆరు సిరీస్‌‌‌‌ల్లో టీమిండియా ఐదు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికా.. ఇలా ప్రతి ప్రత్యర్థిపై తిరుగులేని విజయాలు సాధించింది. దీంతో హాట్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ మొత్తం టీమిండియాదే కప్‌‌‌‌ అన్నారు. ఫైనల్లో కివీస్‌‌‌‌ పోటీ ఇస్తుందో లేదోనని విశ్లేషించారు. కానీ సౌతాంప్టన్‌‌‌‌లో ఆరు రోజుల పాటు జరిగిన టైటిల్‌‌‌‌ పోరులో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఇలా అనడం కంటే కెప్టెన్‌‌‌‌గా విరాట్‌‌‌‌.. టీమ్‌‌‌‌ను సరైన రీతిలో నడిపించలేకపోయాడు. సరైన  ప్రాక్టీస్‌‌‌‌ లేకుండా బరిలోకి దిగి ఘోరంగా విఫలమైంది. అన్నింటికంటే విరాట్‌‌‌‌ ఎంచుకున్న టీమ్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పేస్‌‌‌‌ పిచ్‌‌‌‌పై ఇద్దరు స్పిన్నర్లను ఆడించి కెప్టెన్‌‌‌‌గా అతిపెద్ద తప్పు చేశాడు. ఇక బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గానూ విరాట్‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌పై తీవ్ర ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి అతను చేసిన రన్స్‌‌‌‌ 57 మాత్రమే. ఓవరాల్‌‌‌‌గా అటు కెప్టెన్‌‌‌‌గా, ఇటు బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా కోహ్లీ విఫలం కావడం.. టీమిండియాకు కొత్త నాయకుడు అవసరాన్ని సూచిస్తోంది. 
బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టాలి..?
సాధారణ మ్యాచ్‌‌‌‌ల్లో సెంచరీల మీద సెంచరీలు కొట్టే కోహ్లీ.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం రన్స్‌‌‌‌ చేయలేకపోతున్నాడు. సహచరులలో కాన్ఫిడెన్స్‌‌‌‌ కూడా నింపలేకపోతున్నాడు. వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇది నిరూపితమైంది. భారీ అంచనాలు ఉండే కోహ్లీ.. ఈ రెండు మ్యాచ్‌‌‌‌ల్లో విఫలంకావడంతోనే ఇండియా ఓడిందనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెడితే బాగుంటుందని విశ్లేషకుల వాదన. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో విరాట్‌‌‌‌ ఔటైన తీరు చూస్తే.. అతనిలో ఏకాగ్రత లోపించిందని అర్థమవుతుంది. ఇక గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి. నవంబర్‌‌‌‌ 2019లో విరాట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల్లో లాస్ట్‌‌‌‌ సెంచరీ చేశాడు. ఆగస్ట్‌‌‌‌ 2019లో లాస్ట్‌‌‌‌ వన్డే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆడిన 15 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 8 హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసినా మూడంకెల స్కోరు మాత్రం అందుకోలేకపోయాడు. ఈ మధ్యకాలంలో ఇండియా అందుకున్న అతిపెద్ద విజయాల్లో ఆస్ట్రేలియాలో సిరీస్‌‌‌‌ గెలవడం. కానీ ఇక్కడ విరాట్‌‌‌‌ లేడు. అజింక్యా రహానె సారథ్యంలోని కుర్రాళ్ల టీమ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ గెలవడం అప్పట్లో పెద్ద సంచలనం. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో 36కు ఆలౌటైన తర్వాత రహానె టీమ్‌‌‌‌ను నడిపించిన తీరు అద్భుతం. 
టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కూడా అంతంతే..
పెద్ద మ్యాచ్‌‌‌‌ల్లో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కూడా విరాట్‌‌‌‌కు తలనొప్పిగా మారింది. పిచ్‌‌‌‌, వెదర్‌‌‌‌ కండీషన్స్‌‌‌‌ కాకుండా ప్లేయర్ల రెప్యూటేషన్‌‌‌‌తో టీమ్‌‌‌‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇది చాలా కొంప ముంచుతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇదే జరిగింది. ఫస్ట్‌‌‌‌ డే వాష్‌‌‌‌ ఔట్‌‌‌‌ అయిన తర్వాత టీమ్‌‌‌‌ను మార్చకపోవడం విరాట్‌‌‌‌ అలసత్వానికి పరాకాష్ట. అదే ధోనీగానీ, రహానెగానీ ఉండి ఉంటే కచ్చితంగా టీమ్‌‌‌‌ను ఛేంజ్‌‌‌‌ చేసేవారు. అప్పటికి టాస్‌‌‌‌ కూడా పడలేదు. టీమ్‌‌‌‌ను మార్చుకునే చాన్స్‌‌‌‌ ఉన్నా కూడా విరాట్‌‌‌‌ ఉపయోగించుకోలేదు.  ఇద్దరు స్పిన్నర్లకు బదులు ఎక్స్‌‌‌‌ట్రా బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ను తీసుకుంటే కనీసం 20, 30 రన్స్‌‌‌‌ అదనంగా వచ్చేవి. టార్గెట్‌‌‌‌ 150పైన ఉంటే కివీస్‌‌‌‌పై కచ్చితంగా ఒత్తిడి పెరిగేది. రిజల్ట్‌‌‌‌ కూడా మారేది. అంటే ఇక్కడ కోహ్లీ.. కాన్ఫిడెన్స్‌‌‌‌, ఓవర్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌కు మధ్య బందీ అయ్యాడు. దాని మూల్యమే ఓటమి. ఇవన్నీ చూసిన తర్వాత కోహ్లీలో కెప్టెన్సీ స్కిల్స్‌‌‌‌ తగ్గిపోయాయని, రహానె, రోహిత్‌‌‌‌లలో ఒకర్ని సారథిగా ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. మరి దీనికి సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి..!