కనిపించని కోహ్లీ జాడ: అయోధ్యకు వెళ్ళలేదు..అవార్డు ఫంక్షన్‌కు రాలేదు

కనిపించని కోహ్లీ జాడ: అయోధ్యకు వెళ్ళలేదు..అవార్డు ఫంక్షన్‌కు రాలేదు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియడం లేదు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందినా నిన్న జరిగిన ఈ మహా కార్యక్రమానికి హాజరు కాలేదు. సచిన్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, వెంకటేష్ ప్రసాద్ అయోధ్యకు వచ్చారు. ఇదిలా ఉండగా.. కొద్ది సమయం క్రితం ప్రారంభమైన బీసీసీఐ అవార్డ్స్ వేడుకలో సైతం విరాట్ కనిపించలేదు. దీంతో కోహ్లీ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడేందుకు సిద్ధమైన టీమిండియాకు కోహ్లీ ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్టర్లు, టీం మేనేజ్‌మెంట్ తో విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ కోహ్లీ మొదట ప్రాధాన్యమని.. కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వలన తప్పుకోవాల్సి వచ్చిందని బోర్డు తెలియజేసింది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కారణంగా కోహ్లీ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ దక్షిణాఫ్రికాపై రెండు టెస్టులు,ఆఫ్ఘనిస్తాన్ పై రెండు టీ20 మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో 5 టీ20 ల సిరీస్, దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు టీ20 ల సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రముఖ ఈవెంట్లకు కోహ్లీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. విరాట్ ఎక్కడున్నా బాగుండాలని కొంత మంది అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి కోహ్లీ జాడ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.