
ముంబై: ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ఇండియా వన్డే కెప్టెన్‌గా కోహ్లీపై వేటు వేసి ఆ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించింది. అలాగే, టెస్టు టీమ్ వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానె ప్లేస్‌లో హిట్‌మ్యాన్‌ను నియమించినట్టు బుధవారం ప్రకటించింది. వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే జట్టు ఇంటిదారి పట్టిన తర్వాత కోహ్లీని కెప్టెన్గాతప్పిస్తారన్న వార్తలు వచ్చినా.. అందుకు బీసీసీఐ కొంత టైమ్ తీసుకుంది. సౌతాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి వాలంటరీగా తప్పుకోవాలని బీసీసీఐ కోహ్లీకి 48 గంటల టైమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ, కెప్టెన్సీ వదులుకునేందుకు విరాట్ ఒప్పుకోలేదట. అయినా బోర్డు వెనక్కు తగ్గలేదు. తన స్టేట్‌మెంట్‌లో కోహ్లీని తప్పిస్తున్నట్టు పేర్కొనకుండానే అతని కెప్టెన్సీ తీసేసింది. వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ ఉంటాడని ఆలిండియా సెలక్షన్ కమిటీతో సింపుల్ స్టేట్‌మెంట్ ఇప్పించింది. టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ దక్కడంతో ఫ్యూచర్‌లో రోహిత్ అన్ని ఫార్మాట్లను నడిపించడం ఖాయమే అనొచ్చు.
కారణం ఇదేనా?
సొంతంగా టీ20 నాయకత్వం వదులుకోవడం వల్లే విరాట్ బలవంతంగా వన్డే కెప్టెన్‌గా దిగిపోవాల్సి వచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాను టీ20 కెప్టెన్సీ వదులుకుంటానని వరల్డ్‌కప్‌కు ముందే కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. కానీ, వన్డే సారథ్యం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ వరకూ కెప్టెన్‌గా ఉండాలన్నది తన ఆలోచనగా కనిపించింది. కానీ, బోర్డు ఉన్నట్టుండి రోహిత్‌ను వన్డే కెప్టెన్ చేయడానికి కారణం కోహ్లీ టీ20 సారథ్యం వదులుకోవడమే. వైట్‌బాల్ క్రికెట్‌లో ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలని బీసీసీఐ, సెలక్టర్లు ఇష్టపడటం లేదు. పైగా, వన్డే, టీ20లకు దాదాపు ఒకే సెట్ ప్లేయర్లుంటారు. కానీ, ఈ రెండు ఫార్మాట్లకు ఇద్దరు లీడర్స్ ఉంటే.. ప్లేయర్లు ఎవరికి రిపోర్ట్ చేయాలనే విషయంలో అనవసర సమస్యలు రావొచ్చు. దీన్ని గ్రహించే బోర్డు, సెలక్టర్లు వైట్‌బాల్‌కు ఒకరు, రెడ్‌బాల్‌కు మరొకరు కెప్టెన్‌గా ఉండాలని నిర్ణయించారు. పైగా, 2023 వన్డే వరల్డ్‌కప్ దృష్ట్యా.. కెప్టెన్‌గా రోహిత్‌కు తగిన సమయం ఇవ్వాలని భావించారు.
జూనియర్లకు పెద్దన్నలా రోహిత్
కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లీకి సూపర్ రికార్డు ఉంది. తను కెప్టెన్సీ చేసిన 95 మ్యాచ్‌ల్లో ఇండియా 65 మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం 27సార్లే ఓడింది. కానీ, తన హయాంలో ఇండియా ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా నెగ్గలేదు. ధోనీ వారసుడిగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్న విరాట్ టీమ్‌లో పవర్‌ఫుల్ పర్సన్‌గా ఎదిగాడు. అయితే, ధోనీ మాదిరిగా తను టీమ్‌మేట్స్‌కు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టైమ్‌లో ఓ లీడర్‌గా తను మిగతావాళ్లపై పూర్తిస్థాయి నమ్మకం ఉంచడం లేదట. దాంతో, టీమ్‌లో తమ ప్లేస్‌పై ప్లేయర్లలో అభద్రతా భావం ఏర్పడింది. కొంతకాలం అద్భుతంగా ఆడిన ప్లేయర్.. ఫామ్ కోల్పోతే కోహ్లీ అతనికి అండగా నిలవడం లేదట. ఇందుకు కుల్దీప్ యాదవ్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. అదే టైమ్‌లో టీమ్‌లోని జూనియర్స్‌కు రోహిత్ శర్మ పెద్దన్నలా హెల్ప్ చేసేందుకు ముందుకు రావడంతో అందరూ అతనికి దగ్గరయ్యారు. ఇక, తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పినా విరాట్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇంగ్లండ్ టూర్ చివర్లో రవిశాస్త్రితో కోహ్లీకి పడలేదని సమాచారం. అలాగే, పెద్ద మ్యాచ్‌ల్లో అతను తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు బోల్తా కొట్టాయి. ఇలా చాలా ప్రతికూలతలు ఉండటంతో విరాట్‌ను తప్పించడమే మంచిదని బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది అనొచ్చు. ఏదేమైనా ఇండియా వైట్‌బాల్ ఫార్మాట్‌లో కోహ్లీ కెప్టెన్సీ ఎరా ముగియగా... ఇప్పుడు రోహిత్ శకం మొదలవనుంది.
టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా హిట్‌మ్యాన్‌కే
సౌతాఫ్రికా టూర్‌కు టెస్ట్ టీమ్ ఎంపిక
సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లతో కూడిన టీమ్‌ను ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం సెలక్ట్ చేసింది. ఊహించినట్టే వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానెపై వేటు వేసి రోహిత్‌కు ఆ బాధ్యతలు ఇచ్చింది. అయితే, ఫామ్ కోల్పోయినప్పటికీ రహానెతో పాటు పుజారా, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు చివరి చాన్స్‌గా టీమ్‌తో కొనసాగించింది. ఇక, టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు విహారిని తప్పించి విమర్శలు ఎదుర్కొన్న సెలక్షన్ కమిటీ తిరిగి అతడిని టీమ్‌లోకి తీసుకుంది. అలాగే, కివీస్‌పై సత్తా చాటిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను టీమ్‌లో కొనసాగించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న రోహిత్‌తో పాటు లోకేశ్ రాహుల్, పంత్, బుమ్రా, షమీ తిరిగి టీమ్‌లోకి వచ్చారు. పేసర్లు సిరాజ్, ఉమేశ్‌ను కొనసాగించి అదనంగా శార్దూల్ ఠాకూర్‌ను కూడా సౌతాఫ్రికా పంపుతున్నారు. గాయాల కారణంగా స్పిన్ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ రాహుల్ చహర్ సెలక్షన్‌కు అందుబాటులో లేరని సెలక్షన్ కమిటీ తెలిపింది. అక్షర్, జడేజా గైర్హాజరీలో రీఎంట్రీలో కివీస్‌పై రాణించిన జయంత్‌ను అశ్విన్ స్పిన్ పార్ట్‌నర్‌గా సెలక్ట్ చేసింది. స్టాండ్‌బై ప్లేయర్లుగా దీపక్ చహర్, నవదీప్ సైనీ, అర్జాన్‌తో పాటు యూపీ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 26–--30 మధ్య సెంచూరియన్‌లో ఫస్ట్ టెస్ట్ జరగనుంది. జనవరి 3-–-7 మధ్య సెకండ్ టెస్ట్. 11--–15 మధ్య మూడో టెస్ట్ షెడ్యూల్ చేశారు. జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్ కూడా జరుగుతుంది.
ఇండియా టెస్ట్ టీమ్:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానె, అయ్యర్, విహారి, పంత్ (కీపర్), సాహా (కీపర్), అశ్విన్, జయంత్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా, శార్దూల్, సిరాజ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చహర్, అర్జాన్.