Virat Kohli: ఆ నలుగురి బౌలింగ్‌లో ఆడడం కష్టంగా అనిపించేది: విరాట్ కోహ్లీ

Virat Kohli: ఆ నలుగురి బౌలింగ్‌లో ఆడడం కష్టంగా అనిపించేది: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అంటే ఏ బౌలర్ కైనా దడ పుట్టాల్సిందే. ప్రపంచ స్టార్ బౌలర్లందరినీ అలవోకగా ఆడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే విరాట్ క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఎంతటి బ్యాటర్ కైనా పీడకలలు ఉంటాయి. వారి కెరీర్ లో ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉంటారు. కోహ్లీ కూడా కొంతమంది బౌలింగ్ ఆడడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరూ తమను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఎవరో చెప్పారు. ఈ లిస్ట్ లో నలుగురు బౌలర్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం (మే 3) కోహ్లీ ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో ఎదుర్కొన్న ముగ్గురు కఠినమైన బౌలర్ల పేర్లను వెల్లడించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. టెస్ట్ ఫార్మాట్ లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ అని ఈ భారత మాజీ కెప్టెన్ అన్నాడు. 2014 టెస్ట్ సిరీస్ లో ఆండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ ఆడడానికి బాగా ఇబ్బంది పడ్డాడు.  ఓవరాల్ గా అండర్సన్ వేసిన 710 బంతుల్లో కోహ్లీ 305 పరుగులు చేసి 7 సార్లు ఔట్ అయ్యాడు. ఈ ఏడు సార్లు కోహ్లీ ఇంగ్లాండ్‌తో ఆడుతున్నప్పుడే వచ్చాయి.

వన్డే క్రికెట్ విషయానికి వస్తే శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ పేరు చెప్పాడు. మలింగ బౌలింగ్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉన్నపటికీ ఈ లంక పేసర్ బౌలింగ్ లో ఆడడానికి కష్టపడ్డాడని చెప్పాడు. మలింగ బౌలింగ్ లో కోహ్లీ 218 బంతుల్లో 112.5 సగటు.. 103.2 స్ట్రైక్ రేట్‌తో 225 పరుగులు చేసి రెండు సార్లు ఔటయ్యాడు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వలన నిద్రలేని రాత్రులు గడిపానని.. వన్డే క్రికెట్‌లో అతని బౌలింగ్ లో ఆడడం కష్టమని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ మాజీ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ టీ20 ఫార్మాట్ లో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అని ప్రశంసించాడు.