టీమ్​లో లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెనే అవ్వక్కర్లేదు

టీమ్​లో లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెనే అవ్వక్కర్లేదు

న్యూఢిల్లీ:  కెప్టెన్సీ నుంచి దిగిపోయినప్పటికీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌లో తాను లీడర్‌‌గా, ఓ పెద్దన్నలా ఉండాలని అనుకుంటున్నట్టు ఇండియా మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ చెప్పాడు. టీమ్‌‌లో లీడర్‌‌గా ఉండాలనుకునే వ్యక్తి కెప్టెనే అవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ విషయంలో లెజెండరీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీనే మంచి ఉదాహరణ అన్నాడు. తానెప్పుడూ టీమ్​ను గెలిపించాలని కోరుకుంటున్నానన్న విరాట్​ తనకు తానే ఓ లీడర్​గా ఉంటానని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నాయకత్వం నుంచి దిగిపోయిన నేపథ్యంలో బ్యాటర్‌‌గా రాణించడంపై కోహ్లీ ఫోకస్‌‌ పెట్టాడు. కెప్టెన్​ కాకపోయినా టీమ్‌‌ కోసం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని విరాట్‌‌ తెలిపాడు. ‘మనం ఏం సాధించాలి, మన టార్గెట్స్‌‌ను అందుకున్నామా లేదా అనే దానిపై ఫుల్‌‌ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ప్రతీదానికి పదవీకాలం, కాల వ్యవధి ఉంటుందని మనం కచ్చితంగా తెలుసుకోవాలి.  అలాగే, ఓ కెప్టెన్‌‌గా నా పని ముగిసింది.  ఇప్పుడు ఓ బ్యాటర్‌‌గా నేను టీమ్‌‌కు మరింత సాయం చేయగలను, మరిన్ని విజయాలు అందించగలను అనుకుంటున్నా. కాబట్టి దాన్నే నేను గర్వంగా భావిస్తా’ అని ఓ టాక్‌‌షోలో మాట్లాడిన కోహ్లీ చెప్పాడు. 

ధోనీ బాటలోనే..

ఇప్పుడు టీమ్‌‌లో ఓ ప్లేయర్‌‌గా ఉన్న తాను గతంలో ధోనీ చూపిన మార్గంలోనే నడుస్తానని కోహ్లీ చెబుతున్నాడు. ‘టీమ్‌‌లో లీడర్‌‌గా ఉండటానికి..  కెప్టెన్సీ అవసరం లేదు. ఇందుకు మహీనే ఉదాహరణ.  ధోనీ టీమ్‌‌లో ఉన్నన్నాళ్లూ (కెప్టెన్సీ వదిలేశాక)  లీడర్‌‌గానే కనిపించేవాడు. మాకు ఎలాంటి అవసరం వచ్చినా తనవైపే చూసేవాళ్లం. కెప్టెన్‌‌ కాకపోయినప్పటికీ మహీ మాకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. కానీ, సహజంగానే నాయకత్వ మార్పు అవసరమని, నాకు కెప్టెన్సీ అప్పగించాల్సిన టైమ్‌‌ వచ్చిందని తను అర్థం చేసుకున్నాడు. నేను కోరుకున్న స్థాయికి టీమ్​ను ముందుకెళ్లేందుకు నాయకత్వ బాధ్యతలు నాకు అప్పగించాడు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.  

ఎప్పుడు దిగిపోవాలో తెలుసుకోవాలి

కోహ్లీ  ప్లేస్‌‌లో రోహిత్‌‌ షార్ట్‌‌బాల్‌‌ కెప్టెన్సీ అందుకున్నాడు. తొందర్లోనే టెస్టు సారథ్యం కూడా చేపట్టబోతున్నాడు. ఈ క్రమంలో  కెప్టెన్సీ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమని కోహ్లీ చెప్పాడు. ‘మన కర్తవ్యాన్ని ముగించుకొని ముందుకెళ్లడం కూడా లీడర్‌‌షిప్‌‌లో ఓ భాగమే. దానికి సరైన టైమ్‌‌ ఏంటో తెలుసుకోవాలి.   టీమ్‌‌కు కొత్త మార్గం అవసరం అనిపించినప్పుడే ఆ సమయం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. నేను దిగిపోయినా టీమ్‌‌ కల్చర్‌‌ మాత్రం మారదు. కానీ, ప్లేయర్లలో మరింత ఉత్సాహం నింపేందుకు డిఫరెంట్‌‌ ఐడియాలతో, కొంచెం డిఫరెంట్‌‌గా   నడిపించే వ్యక్తి అవసరం.   అలాగే, ఓ వ్యక్తి అన్ని రకాల బాధ్యతలను, అవకాశాలను అందుకునేందుకు రెడీగా ఉండాలని నేను భావిస్తా.  ఎందుకంటే నేను ధోనీ కెప్టెన్సీలో కొంతకాలం ఆడాను. తర్వాత కెప్టెన్‌‌ అయ్యా. కానీ, ఈ మధ్యలో నా మైండ్‌‌సెట్‌‌ మాత్రం ఒకే రకంగా ఉంది. ఇదివరకు  టీమ్‌‌లో ఓ ప్లేయర్‌‌గా ఉన్నప్పుడు కూడా నేను ఓ కెప్టెన్‌‌లానే ఆలోచించేవాడిని. ఇప్పుడూ అలానే ఉంటా.  నేను  జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా. కాబట్టి నేనే నా లీడర్‌‌గా ఉండాలి’ అని​ అభిప్రాయపడ్డాడు.