మనోళ్లే ముగ్గురు: వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ప్రకటించిన ఐసీసీ

మనోళ్లే ముగ్గురు: వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ప్రకటించిన ఐసీసీ

2023 వన్డేల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేస్ లో ఉన్నారు.  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) గురువారం నాడు 2023 సంవత్సరానికి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేషన్‌లను ప్రకటించింది. విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, శుభమన్ గిల్ లాంటి భారత స్టార్లతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఈ లిస్టులో ఉన్నారు.

2023 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 50 వ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ లో 761 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 2023 లో మొత్తం 27 వన్డేల్లో 72 యావరేజ్ తో 1377 పరుగులు చేసాడు. వీటిలో ఆరు సెంచరీలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 166 పరుగులు అత్యధిక స్కోర్ నమోదు చేసాడు. 

భారత స్టార్ ఓపెనర్ గిల్ ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. 2023 లో గిల్ అసాధారణ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేసిన గిల్.. 2023లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.  

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ 2023 లో బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ లో షమీ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థుల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ప్రారంభ మ్యాచులను ఆడని షమీ..10.7 సగటుతో 24 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ ముగ్గురిలోనే ఒకరికి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరిస్తుందో లేదా కివీస్ ఆటగాడు మిచెల్ కు వెళ్తుందేమో చూడాలి.