
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన విరాట్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 14 ఎడిషన్ ఫేజ్–2 తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకుంటానని ఆదివారం వెల్లడించాడు. అయితే, ప్లేయర్‌గా ఆర్‌సీబీలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘ఆర్‌సీబీ కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్. ఎంతో ఆలోచించి టీమ్ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. గతంలో చెప్పినట్టుగానే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలో ప్లేయర్‌గా కొనసాగుతా. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లున్న ఆర్‌సీబీ జట్టును కెప్టెన్‌గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ అవకాశం నాకిచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లుకు థ్యాంక్స్. నాపై నమ్మకంతో నన్ను సపోర్ట్ చేసిన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కూడా థ్యాంక్స్’ అని కోహ్లీ చెప్పాడు. కాగా, 2013లో ఆర్‌సీబీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ...ఇప్పటిదాకా 132 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 65 మ్యాచ్‌ల్లోనే జట్టును గెలిపించగలిగాడు. కాగా, విరాట్ నాయకత్వంలోని ఆర్‌సీబీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. మూడు సార్లు ఫైనల్లో ఓడింది. మరో మూడుసార్లు ప్లే ఆఫ్స్ వరకు వచ్చింది. కాగా, అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీకి గొప్ప ఆస్తి అని ఆ ఫ్రాంచైజీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్ని సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. ఆర్‌సీబీ లీడర్‌షిప్ గ్రూప్‌కు విరాట్ వెలకట్టలేని సేవలందించాడని పేర్కొన్నారు.