Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. వాడు మనోడే 

Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. వాడు మనోడే 

భారత స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు వచ్చి చేరింది. 2023 సంవత్సరానికిగాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అతని అత్యుత్తమ ప్రదర్శనగానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఈ అవార్డు ప్రకటించింది. 

గతంలో 2012, 2017, 2018లో ఈ అవార్డు అందుకున్న కోహ్లీ.. దీంతో కలిపి నాలుగోసారి. తద్వారా నాలుగుసార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డుతో కలిపి కోహ్లీ ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. ఈ క్రమంలో 10 ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా మరో ఘనత సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(4 అవార్డులు), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (4 అవార్డులు) అందుకున్నారు. విరాట్ సాధించిన ఈ ఐసీసీ అవార్డుల రికార్డులను మరో ఆటగాడు బీట్ చేయడమనేది దాదాపు అసంభవమే.

గతేడాది కోహ్లీ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. ఏడాది మొత్తంలో 24 ఇన్నింగ్స్‌ల్లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. అలాగే, వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒక్క ప్రపంచ ప్‌ టోర్నీలోనే మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు బాదాడు.