విశాఖలో ఇన్ఫోసిస్‌ అతిపెద్ద డేటా సెంటర్‌... జూన్ 28న    కార్యాలయం ప్రారంభం 

విశాఖలో ఇన్ఫోసిస్‌ అతిపెద్ద డేటా సెంటర్‌... జూన్ 28న    కార్యాలయం ప్రారంభం 

విశాఖ‌ప‌ట్ట‌ణం సాగ‌ర తీరంలో స‌రికొత్త క‌ళ సంత‌రించుకోనుంది. ఇప్ప‌టికే ప‌రిపాల‌నా రాజ‌ధాని విశాఖ‌లో ఏర్పాటు చేస్తాన‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం .. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తాన్ని నిర్ణ‌యించింది. ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్‌ సన్నద్ధమవుతోంది. రుషికొండ ఐటీ పార్క్‌ హిల్‌ నం.2లో భారీ భవన నిర్మాణం పూర్తయింది. శాటిలైట్ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన...ఇన్ఫోసిస్‌ ఇప్పుడు డేటా డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా రూపొందుతుంది.  

తొలివిడతలో 650 మంది సామర్థ్యంతోసేవలకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 1000 మందితో సెంటర్‌ నడిపేందుకు సిద్ధమవుతోంది. క్యాంపస్‌కు ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్న అభ్యర్థుల్ని ఇప్పటికే ఇన్ఫోసిస్‌ ఆహ్వానించినట్లు సంస్థ అధికారులు ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు.  

రాష్ట్ర ప్రభుత్వం విశాఖ  బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ని ప్రమోట్‌ చేస్తుండటంతో దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. రూ.14,634 కోట్లతో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దాదాపు 25 వేల మందికి  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

విశాఖ‌లో ఏర్పాటు చేసే  డేటా సెంటర్  దేశంలోనే అతిపెద్ద సెంట‌ర్‌గా మారనుంది. విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అతి త్వరలోనే విశాఖపట్నం ఐటీ హబ్‌గా అవతరించనుందని ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.