విశ్వక్సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న సినిమా ‘ఈఎన్ఈ రిపీట్’. అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ డేట్‌తో కూడిన క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఈఎన్ఈ రిపీట్’ ఫ్లైట్.. నవంబర్ 19న టేకాఫ్ అవడానికి రెడీ అవుతోంది అంటూ రిలీజ్‌డేట్‌ను కన్ఫర్మ్ చేశారు.
ఇందులో నలుగురు యువకులు సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, కెమెరా పరికరాలు, ఇతర లగేజీ మధ్య కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి లుక్, హావభావాలు ప్రత్యేకంగా ఉండటంతో పోస్టర్ ఆసక్తికరంగా, వినోదాత్మకంగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ కూలింగ్ గ్లాసెస్‌తో చేతిలో బ్రౌన్ లెదర్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. బ్లూ టీ-షర్ట్, కళ్లద్దాలతో ఉన్న వెంకటేష్ కాకుమాను సూట్కేసుకు ఆనుకుని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
ఎడమవైపు ప్రొఫెషనల్ కెమెరా, ట్రైపాడ్ పట్టుకున్న శ్రీనాథ్ మాగంటి.. ఫిల్మ్ మేకింగ్‌లో తన పాత్రకు ఉన్న అనుబంధాన్ని సూచిస్తున్నాడు. మధ్యలో గ్రీన్ షర్ట్‌లో ఉన్న అభినవ్ గోమఠం చేతిలో ఓ కాగితం పట్టుకుని ఆశ్చర్యపోయినట్టుగా ఉన్నాడు. పాత్రలు, లగేజీతో నిండిన ఈ పోస్టర్ గందరగోళం, కామెడీతో కూడిన కథను చెబుతున్నట్టుగా ఆసక్తిని పెంచుతోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
