రివ్యూ : అశోకవనంలో అర్జునకళ్యాణం

రివ్యూ : అశోకవనంలో అర్జునకళ్యాణం

రివ్యూ : అశోకవనంలో అర్జునకళ్యాణం
రన్ టైమ్: 2 గంటల 29 నిమిషాలు
నటీనటులు: విశ్వక్ సేన్, రితికా నాయక్, రుక్షర్ దిల్లాన్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: పవి.కె పవన్
మ్యూజిక్ : జై క్రిష్
కథ,మాటలు,స్క్రీన్ ప్లే: రవి కిరణ్ కొల్ల
నిర్మాతలు : బాపినీడు, సుధీర్
డైరెక్షన్: చింత సాగర్
రిలీజ్ డేట్: 6 మే 2022

మాస్‌ సినిమాలకు పెట్టింది పేరు విశ్వక్ సేన్. తక్కువ సినిమాలే చేసినా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్.. తాజాగా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్లాసీ క్యారెక్టర్లో విశ్వక్ సేన్ ఏ మేరకు అలరించాడో తెలుసుకునేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ రోజు రిలీజైన  అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించిందో చూద్దాం.

కథ
సూర్యాపేటలో ఉన్న అర్జున్ కుమార్ అల్లంకు 33 ఏళ్లయినా పెళ్లి కాదు. చిన్న బిజినెస్ చేసుకునే తాను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని ఆశ పడుతుంటాడు. ఊరిలో వాళ్ల కులంలోని అమ్మాయిలు దొరకకపోవడంతో వేరే కులం అయినా పర్లేదు అనుకున్నా ఎవరూ దొరకరు. దీనికి తోడు అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. చుట్టాలు, ఊరిలో వారి ఒత్తిడితో రాజమండ్రి వెళ్లి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కు ఓకే చేస్తాడు. ఎంగేజ్మెంట్ చేసుకొని తిరిగొద్దాం అనేసరికి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోతారు. పెళ్లి వాళ్లు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రా తెలంగాణ వాళ్ళకు సెట్ అయిందా? అర్జున్ కుమార్ ఆ అమ్మాయిని చేసుకున్నాడా లేదా అనేది కథ.

కథ ఎలా ఉందంటే..
అశోకవనంలో అర్జునకళ్యాణం మూవీని  డైరెక్టర్ సింపుల్గా డీల్ చేశాడు . కథ రోటీన్గా  ఉన్నప్పటికీ నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ మొత్తం నెమ్మదిగా సాగడంతో ఆడియెన్స్ బోర్ ఫీలవుతారు. సెకండాఫ్ కొచ్చేసరికి  ముందు ముందు ఏం జరగనుందో ప్రేక్షకులు ఊహించగలుగుతారు. కానీ రైటర్ రవికిరణ్ కథనం అందరినీ ఆకట్టుకుంటుంది. పెళ్లీడుకొచ్చిన ప్రతి అబ్బాయి సినిమాకు కనెక్టవుతాడు. 30 ఏళ్లు రాగానే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలా? అనే అంశాన్ని చక్కగా ప్రజెంట్ చేశాడు. అమ్మాయిలకు కూడా లైఫ్లో సెటిల్ అయ్యాక నచ్చిన వ్యక్తితో పెళ్లి చెయ్యాలి అనే పాయింట్ను సున్నితంగా చెప్పాడు.  

ఎవరెలా చేశారంటే..
విశ్వక్ సేన్ నటన బాగుంది. ఈ సినిమాతో నటుడిగా ఇంకో మెట్టు ఎదిగాడని చెప్పుకోవచ్చు. 33 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. రుక్షర్ దిల్లాన్ ఫర్వాలేదనిపించింది. రితికా నాయక్ అనే కొత్తమ్మాయి నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. పేరెంట్స్ పాత్రల్లో చేసిన నటీనటులందరూ బాగా చేశారు. కాదంబరి కిరణ్, వెన్నెల కిషోర్ లు నవ్వులు పూయించారు. జై క్రిష్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూడ్ క్యారీ చేశారు. ల్యాగ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని సీన్లు కత్తిరిస్తే బాగుండేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఓవరాల్ గా చూస్తే కాస్త ఓపిక చేసుకుంటే అశోకవనంలో అర్జున కళ్యాణం బాగుంది.