ఎంపీ స్వగ్రామంలో లోకల్​ లీడర్ల దందా

ఎంపీ స్వగ్రామంలో లోకల్​ లీడర్ల దందా

సిద్దిపేట, వెలుగు: డబ్బులిచ్చినవారికే డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్లు ఇస్తామంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో లోకల్​లీడర్లు వసూళ్ల దందా మొదలుపెట్టారు. ఇండ్లు కట్టిన స్థలం గతంలో బీసీలకు కేటాయించారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వారు స్థలాలను ఇచ్చినందుకు పరిహారం ఇవ్వాలంటూ లబ్ధిదారులకు చెబుతున్నారు. పోతారం గ్రామం మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకరరెడ్డి స్వగ్రామం. 1994 లో గ్రామానికి చెందిన 6, 7 సర్వే నంబర్లలోని రెండున్నర ఎకరాలలో బలహీనవర్గాలకు చెందిన 54 మందికి 120 గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాలని నిర్ణయించారు. ఆ స్థలంలో 35 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. స్థలాలను ఇచ్చిన 27 మందితో పాటు మరో 8 మందిని అర్హులుగా గుర్తించారు. 

అదే సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారిలో సగం మందికి ఇండ్లు లభించలేదని, ఇండ్లు లభించినవారు ఎంతోకొంత డబ్బులు ఇవ్వాలంటూ కొందరు లీడర్లు వసూళ్ల పర్వానికి తెరలేపారు. తమ స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందినవారు రూ. 15 వేల చొప్పున, కొత్తగా ఇండ్లు పొందిన లబ్ధిదారులు 60 వేల చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు. దాదాపు రూ. 9 లక్షలు ఇండ్లు లభించని స్థల యజమానులు ఒక్కొక్కరికి రూ. 33 వేల చొప్పున అందజేస్తామని లీడర్లు చెబుతున్నారు. అయితే నిరుపేదలం కావడంతోనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని, ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటని లబ్ధిదారులు మండిపడుతున్నారు. విషయాన్ని బయట చెబితే మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కదని లబ్ధిదారులు నోరు విప్పడానికి జంకుతున్నారు. అయినప్పటికీ ఆ నోటా ఈ నోటా విషయం బయటకు వచ్చింది. దీంతో ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి స్వగ్రామంలో జరుగుతున్న వసూళ్ల పర్వం మండలవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది.